Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మళ్లీ ప్రమాదం.. ఆవును ఢీకొట్టిన రైలు..

|

Oct 29, 2022 | 1:57 PM

పశువులు, ఆవుల మందలు ట్రాక్‌ల పైకి రావడంతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. అక్టోబర్‌లో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మూడుసార్లు ప్రమాదానికి గురయ్యింది.

Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మళ్లీ ప్రమాదం.. ఆవును ఢీకొట్టిన రైలు..
Vande Bharat Express
Follow us on

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ మరోసారి ప్రమాదానికి గురయ్యింది. గుజరాత్‌లోని వల్సాద్‌ స్టేషన్‌ నుంచి వెళుతుండగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ ఆవును ఢీకొట్టింది. రైలు ముంబై నుంచి గుజరాత్ వెళ్తుండగా శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వందేభారత్ రైలు ఆవును ఢీకొట్టిన ఈ ప్రమాదంలో రైలు ముందుభాగం ధ్వంసమయినట్లు అధికారులు తెలిపారు. దీంతో రైలు కొంతసేపు ఆగిపోయింది. సిబ్బంది యుద్దప్రాతిపదికన రైలు ముందుభాగానికి మరమ్మతులు నిర్వహించారు. దీని తరువాత రైలు తిరిగి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

పశువులు, ఆవుల మందలు ట్రాక్‌ల పైకి రావడంతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. అక్టోబర్‌లో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మూడుసార్లు ప్రమాదానికి గురయ్యింది. తాజా యాక్సిడెంట్‌కు సంబంధించి గుర్తుతెలియని ఆవుల మంద యాజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు ఈ హైస్పీడ్ రైలు 7 అక్టోబర్ 2022 న గాంధీనగర్ నుంచి ముంబైకి ప్రయాణిస్తుండగా ఆనంద్ స్టేషన్ వద్ద ఆవును ఢీకొట్టింది. దీంతో రైలు ముందు భాగం దెబ్బతింది. దీనికి రెండు రోజుల ముందు ఈ రైలు అహ్మదాబాద్ సమీపంలోని వత్వా వద్ద నాలుగు గేదెలను ఢీకొట్టింది. అప్పుడు కూడా రైలు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

గుర్తు తెలియని గేదెల యజమానులపై కేసు..

వందేభారత్ రైలు.. పశువులు ఢీకొన్న ఘటనలపై అధికారులు.. గుర్తు తెలియని యజమానులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అధికారులు ఈ మార్గంలో గేదెలు, ఆవులను వదలకూడదంటూ.. అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అధికారులు తలపట్టుకుంటున్నారు.

సెప్టెంబర్ 30న ప్రారంభం..

వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ ను సెప్టెంబర్‌ 30వ తేదీన ప్రధాని న‌రేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్ గాంధీ న‌గ‌ర్ – ముంబై మ‌ధ్య రాకపోకలు సాగిస్తోంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు.. అత్యాధునిక ప్రమాణాలతో గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దీనికి అనుసంధానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..