
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సిరాతు తహసీల్ ప్రాంతంలోని భైంసహపర్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల రియా మౌర్య అనే బాలికను ఒక పాము నెలలో ఐదుసార్లు కాటు వేసింది. ఈ ఘటనపై రియా తండ్రి రాజేంద్ర మౌర్య మాట్లాడుతూ.. 2025 జూలై 22న పొలానికి వెళుతుండగా, తన కుమార్తెను మొదటిసారి పాము కరిచిందని చెప్పారు. వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించి చికిత్స తర్వాత ఆమెను ఇంటికి తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే ఆమె కోలుకొని కొన్ని నెలలు కూడా కాక ముందే ఆగస్ట్ 13న మరోసారి రియాను పాము కరిచినట్టు ఆయన చెప్పారు. అప్పుడు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆమెను ప్రయాగ్‌రాజ్‌కు రిఫర్ చేశారు, కానీ తాము స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌లో రియాకు చికిత్స ఇప్పించినట్టు తెలిపాడు.
అంతా బాగుంది అనుకునే క్రమంలో మరోసారి మృత్యువు రియాను వెంటాడినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఆగస్టు 27 నుండి ఆగస్టు 30వ తేదీ మధ్యలో మరో నాలుగు సార్లు రియాపై పాము దాడి చేసినట్టు ఆయన తెలిపారు. స్నానం చేస్తున్నప్పుడు, ఇంటి పనులు చేస్తున్నప్పుడు ఇలా మొత్తం నాలుగు సార్లు రియాను పాము కాటు వేసినట్టు చెప్పుకొచ్చాడు. ఇలా వెంటవెంటనే తన కూతురు పాము కాటుకు గురికావడంతో తన పొదుపు చేసిన డబ్బు మొత్తం ఆమె వైద్యానికే సరిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే పదేపదే ఇలా జరగడంతో అనుమానం వచ్చిన అతను భూతవైద్యుడిని కూడా ఆశ్రయించినట్టు తెలిపాడు.
ఇదే ఘటనపై బాధితురాలు రియా మాట్లాడుతూ.. తనను కరిచిన పాము చాలా పెద్దగా, ముదురు నలుపు రంగులో ఉన్నట్టు ఆమె తెలిపింది. అలాగే దానిపై ఆకుపచ్చ చారలు కూడా ఉన్నాయని తెలిపింది. ఆ పాము కాటువేసిన గంట తర్వాత తాను స్పృహ కోల్పోయేదానినని.. తాను లేచి చూసేసరికి హాస్పిటల్ బెడ్‌పైనో లేదా, భూతవైద్యం చేసి వారి దగ్గరో ఉండేదానన్ని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా బాలికపై పదేపదే పాము దాడి చేస్తుందనే విషయం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు స్థానిక జనాలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై అటవీశాఖ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా వారి ఆ పామును పట్టుకోవడం లేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.