
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ఏఐ సాయంతో ఏ పనినైనా సులువుగా సెకన్లలోనే చేసేస్తున్నారు. మనిషి నెలల రోజుల్లో పూర్తి చేయగలిగిన పనిని ఏఐ నిమిషాల్లోనే పూర్తి చేస్తోంది. అత్యంత వేగంగా పూర్తి చేసే టెక్నాలజీ కలిగి ఉండటంతో కంపెనీలన్నీ ఏఐ బాట పడుతున్నాయి. అయితే కొంతమంది తప్పుడు పనులకు కూడా ఏఐను ఉపయోగిస్తున్నారు. ఫేక్ ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేసి తమ చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం దీనిని ఒక సాధనంగా వినియోగించుకుంటున్నారు. తాజాగా ఒక వ్యక్తి హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ఏఐ సాయంతో తాను చనిపోయినట్లు, అంత్యక్రియలు జరిగినట్లు ఒక వీడియోను క్రియేట్ చేశాడు. యూపీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారగా.. పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు వివరాల్లోకి వెళ్తే..
యూపీకి చెందిన రాజ్ భర్ అనే వ్యక్తి 2016 డిసెంబర్ 19వ తేదీన మున్షిపురా రైల్వే స్టేషన్ సమీపంలో యోగేష్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేశాడు. దీంతో మృతుడు మేనల్లుడు ఫిర్యాదుతో రాజ్ భర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే హత్య కేసు నుంచి బయటపడటానికి అతడు తాను చనిపోయినట్లు, అంత్యక్రియలు కూడా జరిగినట్లు ఏఐ వీడియోతో ఒక నకిలీ వీడియోను రూపొందించుకున్నాడు. స్మశానంలో చితిపై పడి ఉన్నట్లు ఏఐ సాయంతో ఒక ఫొటోను సృష్టించుకున్నాడు. మృతదేహానికి బదులుగా మేకను దహనం చేశాడు. అంతేకాకుండా అంత్యక్రియలు సందర్భంగా ఊరేగింపు, చివరి కర్మ ఫొటోలను కూడా ఏర్పాటు చేశాడు. ఈ ఫొటోల ఆధారంగా డేట్ సర్టిఫికేట్ కూడా పొందాడు. అయితే పోలీసలు విచారణలో ఇవి ఏఐ జనరేటెడ్ ఫొటోలు అని తేలడంతో అతడిపై ఫోర్జరీ కేసు నమోదు చేశాడు. దీంతో హత్య కేసుతో పాటు ఫోర్జరీ కేసును కూడా నిందితుడు ఎదుర్కొంటున్నాడు.
ఇంటర్ పాస్ అవ్వని రాజ్ కుమార్ రాజ్ భర్ స్టాక్ మార్కె్ట్ ట్రేడర్‌గా పనిచేశాడు. ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానని నమ్మించాడు. అయితే వారి నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు, హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ఇలా ఏఐ సాయంతో తనకు అంత్యక్రియలు జరిగినట్లు నకిలీ ఫొటోలు సృష్టించుకున్నాడు. మౌ మున్సిపల్ కౌన్సిల్ నుంచి డెట్ సర్టిఫికేట్ కూడా పొందాడు. దానిని లాయర్లు కోర్పులో సమర్పించగా. గత ఏడాదిగా నిందితుడు స్వేచ్చగా జీవిస్తున్నాడు. అయితే చివరికి అది నకిలీదని తేలడంతో.. అక్టోబర్ 25న స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, నిఘా బృందం సహాయంతో కోత్వాలి నగర్ పోలీసులు అతడిని ఖ్వాజాజహాన్పూర్ ప్రాంతం సమీపంలో అరెస్టు చేశారు. న్యాయపరమైన చర్యల నుండి తప్పించుకోవడానికి రాజ్‌భర్ తన మరణం గురించి ఒక కట్టుకథ అల్లి, నకిలీ పత్రాలను కోర్టుకు సమర్పించాడని పోలీసులు తెలిపారు.