మీరట్‌లో దారుణం.. ముగ్గురు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య

|

Jan 09, 2025 | 11:08 PM

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు అత్యంత పాశవికంగా హత్యకు గురయ్యారు. తల్లిదండ్రులను హతమార్చిన దుండగులు, ముగ్గురు మైనర్ బాలికలను హత్య చేసి, గోనె సంచిలో కుక్కి దాచి పెట్టారు. బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మీరట్‌లో దారుణం.. ముగ్గురు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య
Family Murder
Follow us on

ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో భర్త, భార్య, ముగ్గురు బాలికలు ఉన్నారు. హత్య అనంతరం మృతదేహాలను ఇంట్లోనే దాచిపెట్టారు. మీరట్ జిల్లా లిసాది గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

మృతుల్లో మోయిన్, అతని భార్య అస్మా, వారి ముగ్గురు కుమార్తెలు అఫ్సా (8), అజీజా (4), అదీబా (1) ఉన్నారు. భర్త, భార్య, పిల్లలను హత్య చేసిన అనంతరం నిందితులు బాలికల మృతదేహాలను గోనె సంచిలో కట్టి పడక పెట్టెలో దాచారు. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో దోపిడి కోసం వచ్చిన దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గురువారం(జనవరి 9) సాయంత్రం మొయిన్ సోదరుడు సలీం ఇంటికి చేరుకోవడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటి తలుపు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఇరుగుపొరుగు వారిని విచారించిన తర్వాత బలవంతంగా తలుపులు పగలగొట్టారు. లోపల మోయిన్, అస్మా మృతదేహాలు నేలపై పడి ఉండగా, బాలికల మృతదేహాలను బెడ్ రూమ్‌లో బయటపడ్డాయి.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌ఎస్పీ విపిన్‌ తడ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రైం బ్రాంచ్, ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించారు. ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి దారుణ హత్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మీరట్‌ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ హత్యను వీలైనంత త్వరగా ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. న్యూ ఇయర్‌కు రెండు రోజుల ముందు, రాజధాని లక్నోలో తండ్రి, కొడుకు కలిసి ఒక తల్లి. నలుగురు కుమార్తెలను హత్య చేశారు. అంతకుముందు వారణాసిలో నవంబర్ 2024లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఇందులో భర్త రాజేంద్రప్రసాద్ గుప్తా, భార్య నీతు, ముగ్గురు పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..