AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తను చంపి పాముకాటుగా చిత్రీకరణ.. భార్య, ప్రియుడికి మరణశిక్ష విధించిన కోర్టు!

అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేసి, ఆ ఘటనను పాముకాటు మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో భార్య రవిత, ఆమె పొరుగువాడైన అమర్‌దీప్‌కు మరణశిక్ష విధించింది. భర్తను గొంతు నులిమి చంపిన అనంతరం, మృతదేహం కింద పామును ఉంచి సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

భర్తను చంపి పాముకాటుగా చిత్రీకరణ.. భార్య, ప్రియుడికి మరణశిక్ష విధించిన కోర్టు!
Death Penalty
Balaraju Goud
|

Updated on: Oct 16, 2026 | 4:04 PM

Share

మీరట్: అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేసి, ఆ ఘటనను పాముకాటు మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో భార్య రవిత, ఆమె పొరుగువాడైన అమర్‌దీప్‌కు మరణశిక్ష విధించింది. భర్తను గొంతు నులిమి చంపిన అనంతరం, మృతదేహం కింద పామును ఉంచి సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

2025 ఏప్రిల్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన

మిక్కీగా కూడా పిలిచే అమిత్ కశ్యప్ 2025 ఏప్రిల్ 12న ఉత్తరప్రదేశ్‌లోని అక్బర్‌పూర్ సదాత్ గ్రామంలో తన ఇంట్లో విగతజీవిగా కనిపించాడు. అతని మృతదేహం కింద పాము ఉండటంతో కుటుంబ సభ్యులు తొలుత పాముకాటుతో మరణించి ఉంటాడని భావించారు. అయితే, మృతదేహంపై గాయాలు, మెడపై ఉన్న గుర్తులు అనుమానాలకు తావిచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులమడం వల్ల ఊపిరాడక మరణించినట్లు వెల్లడవడంతో కేసు కీలక మలుపు తిరిగింది.

పాముతో నాటకం.. బయటపడిన కుట్ర?

ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం.. రవిత, అమర్‌దీప్ మధ్య ప్రేమ సంబంధం ఉండగా, అమిత్‌ను హత్య చేసేందుకు ఇద్దరూ కుట్ర పన్నారు. హత్య అనంతరం దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించేందుకు మృతదేహం కింద పామును ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. పామును పరీక్షించిన నిపుణులు దాని విషపు సంచిని తొలగించినట్లు గుర్తించారని ప్రాసిక్యూషన్ తెలిపింది. దీంతో పాముకాటు మరణానికి కారణమనే అనుమానాలకు బలం లేకుండా పోయింది.

కాల్ రికార్డులే కీలక ఆధారాలు

ఈ కేసులో పోస్టుమార్టం నివేదికతో పాటు మొబైల్ ఫోన్ కాల్ రికార్డులు కీలకంగా మారాయి. అమిత్ మరణం తర్వాత నాలుగు రోజుల్లో రవిత, అమర్‌దీప్ 70కిపైగా సార్లు మాట్లాడుకున్నట్లు ప్రాసిక్యూషన్ వెల్లడించింది. వారి మధ్య 500కు పైగా కాల్స్‌కు సంబంధించిన వివరాలను దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలిపింది. పోలీసులు 500 పేజీలకు పైగా ఛార్జిషీట్ దాఖలు చేయగా, డజనుకు పైగా సాక్షులను విచారించారు.

అక్టోబర్ 7న దోషులుగా నిర్ధారణ

అదనపు జిల్లా జడ్జి-12 కోర్టు అక్టోబర్ 7న రవిత, అమర్‌దీప్‌లను హత్య, నేరపూరిత కుట్ర కేసుల్లో దోషులుగా నిర్ధారించింది. శిక్షపై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్, బాధితుడి కుటుంబం తరఫు న్యాయవాదులు నిందితులకు మరణశిక్ష విధించాలని కోరారు. ప్రణాళికాబద్ధమైన హత్య, సాక్ష్యాలను దాచే ప్రయత్నాలను వారు ప్రస్తావించారు. చివరకు శుక్రవారం (అక్టోబర్ 16) ఇద్దరికీ మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us