హమీర్‌పుర్, జనవరి 1: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో చికిత్స పొందుతున్న ఓ మహిళ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆమె మృతదేహాన్ని జలంధర్ నుంచి అంబులెన్స్‌లో ఆమె భర్త తన స్వగ్రామానికి దహన సంస్కారాలకు తీసుకువెళుతుండగా.. మార్గం మధ్యలో ఉన్నట్టుండి లేచి కూర్చుంది. తాగేందుకు నీళ్లు ఇవ్వాలని కోరింది. ఈ హఠాత్ పరిణామానికి అందరూ ఒక్కసారిగా బిత్తరపోయారు. అసలేం జరిగిందంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పుర్ జిల్లా రాఠ్ పోలీస్‌స్టేషను పరిధిలోని సదర్ గ్రామానికి చెందిన మతాదిన్ రక్వార్ భార్య అనిత (33) కొన్నాళ్లుగా బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతోంది. తాజాగా మెరుగైన చికిత్స సౌకర్యాల కోసం అనితను ఆమె భర్త మతాదీన్, పిల్లలతో కలిసి జలంధర్‌లోని వారి బంధువుల ఇంటికి వెళ్లారు. కొద్ది రోజుల క్రితం ఆమె పరిస్థితి విషమించడంతో భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అక్కడి వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో చేసేదిలేక దహన సంస్కారాల కోసం హమీర్‌పూర్‌లోని స్వగ్రామనికి మతాదీన్ తన భార్య మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నాడు. అంబులెన్స్ నోయిడాకు చేరుకోగానే నీళ్లు కావాలంటూ భార్య మాట్లాడటం చూసి మతాదీన్ ఆశ్చర్యపోయాడు. వెంటనే భార్య ముఖంపై నుంచి షీట్ తొలగించి చూడగా.. ఆమె కళ్లు తెరచి తన వైపే చూడటం గమనించాడు. దీంతో తన భార్య బతికే ఉందని తెలుసుకున్న మతాదీన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంఘటన గురించి తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అనితను చూసేందుకు వారి ఇంటికి గుంపులు గుంపులుగా తరలివచ్చారు.
కాగా భోపాల్, అమృత్‌సర్, జలంధర్ వంటి నగరాల్లోని పెద్ద ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తరచూ సిటీకి తీసుకెళ్లే పరిస్థితి లేకపోయింది. 15 రోజుల క్రితం అనిత ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో జలంధర్‌లోని బంధువు రాజు ఇంటికి భార్య, పిల్లలను తీసుకుని భర్త మతాదీన్ తీసుకెళ్లాడు. అక్కడ స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా రూ.20 వేలు కట్టిన తర్వాత మాత్రమే వైద్యులు చికిత్స ప్రారంభించారని, ఆ తర్వాత రోజు ఉదయం రూ.60 వేలు డిపాజిట్ చేయమని మతాదీన్ తెలిపాడు. తీరా కొన్ని గంటలు గడచిన తర్వాత ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారని మతాదీన్ చెప్పారు. దీంతో మృతదేహాన్ని తనకు అప్పగించడంతో హమీర్‌పూర్‌లోని తన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు రూ.30,000 చెల్లించి ఓ ప్రైవేట్ అంబులెన్స్‌ను అద్దెకు తీసుకున్నారు. నోయిడా చేరుకోగానే.. భార్య అనిత అకస్మాత్తుగా కళ్లు తెరిచ నీళ్లు అడగటంతో ఆశ్చర్యపోయానని మీడియాకు తెలిపాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.