ఆ ఊరిలో రాత్రికిరాత్రే భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో పరారైన భార్యలు.. అసలేం జరిగిందంటే..
కేంద్రప్రభుత్వం అందించిన నిధులు అందీఅందగానే ఐదుగురు వివాహితులు తమ భర్తలకు ఊహించని షాకిచ్చారు. విషయం తెలుసుకున్న బాధిత భర్తలు తమకు సాయం చేయకున్న పర్వాలేదు..
కేంద్రప్రభుత్వం అందించిన నిధులు అందీఅందగానే ఐదుగురు వివాహితులు తమ భర్తలకు ఊహించని షాకిచ్చారు. విషయం తెలుసుకున్న బాధిత భర్తలు తమకు సాయం చేయకున్న పర్వాలేదు తమ భార్యల అకౌంట్లలో మాత్రం డబ్బు జమ చేయద్దంటూ అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద భూమి ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వాయిదాల్లో రూ.2.5 లక్షలు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఈ పథకం కింద ఇటీవల బారాబంకీ జిల్లా నుంచి 40 మంది మహిళలను లబ్ధిదారులుగా అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో మొదటి వాయిదా కింద 50 వేల రూపాయలు చొప్పున కొందరు మహిళల ఖాతాల్లో జమయ్యాయి. ఖాతాల్లో నగదు జమ అవగానే ఐదుగురు మహిళలు తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో కలిసి పారిపోయారు. దీంతో లభోదభోమన్న ఆయా బాధిత భర్తలు ఎట్టిపరిస్థితుల్లోనూ రెండో విడత డబ్బులను తమ భార్యల ఖాతాల్లో జమ చేయొద్దంటూ అధికారులను వేడుకొంటున్నారు. డబ్బుతో మహిళలు పరారవ్వడం స్థానికంగా సంచలనం రేపింది.
‘సత్రిఖ్, జైద్‌పూర్, బంకి, ఫతేపూర్, బెల్హారా నగర్ పంచాయతీల నుంచి ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభించలేదంటూ కొన్ని రోజుల క్రితం విడివిడిగా ఐదు ఫిర్యాదులు వచ్చాయి. కేంద్రం అందించిన తొలి విడత డబ్బు అందుకున్న తర్వాత ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించనందుకు మేము దరఖాస్తుదారులకు నోటీసు ఇచ్చాము. ఇంతలో తమ భార్యలు డబ్బుతో పరారయ్యారని, మిగతా రెండు వాయిదాల డబ్బు వాళ్ల ఖాతాల్లో జమచేయొద్దంటూ ఆ 5 దరఖాస్తుదారులు వచ్చి ఫిర్యాదు చేశారని’ డీయూడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌరభ్ త్రిపాఠి మీడియాకు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిజానిజాలు తెలుసుకుంటామని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.