Uttar Pradesh Assembly Election 2022: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 3వ రౌండ్ పోలింగ్ ప్రధాన రాజకీయ పక్షాల్లో గుబులు పుట్టిస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)లలో నిక్షిప్తమైన ఓటరు దేవుళ్ల తీర్పు అంతుచిక్కక ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. పైకి ఎవరికి వారు ఓటర్ల తమవైపే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, లోలోన లెక్కలు వేసుకుంటూ హోరాహోరీగా సాగిన పోరులో ఎవరు గట్టెక్కుతారో తెలియని ఉత్కంఠలో మునిగిపోయారు. ఆదివారం (ఫిబ్రవరి 20న) జరిగిన ఈ మూడో రౌండ్‌తో మొత్తం 403 నియోజకవర్గాల్లో 172 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. అధికారపగ్గాలు చేపట్టాలనుకునే పార్టీలకు ఈ రౌండ్ అత్యంత కీలకంగా మారింది. సమాజ్‌వాదీ (SP), రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) జట్టుకట్టడంతో మారిన సామాజిక సమీకరణాలు తొలి రెండు రౌండ్లలో తమ కూటమికి ఎక్కువ లాభించినట్టు ఆ పార్టీలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. తొలి రెండు దశల పోలింగ్ జరిగిన పశ్చిమ యూపీలో ముస్లింలు, జాట్ల సంఖ్యాబలం ఎక్కువ. చాలా నియోజకవర్గాల్లో ఈ రెండు వర్గాల సంఖ్యాబలం 50% కంటే ఎక్కువే ఉంది. ఎస్పీ-ఆరెల్డీ పొత్తు బీజేపీ(BJP) విజయావకాశాలను గట్టిగా దెబ్బకొ అవకాశముందన్న అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో 3వ రౌండ్ నుంచి ఆధిక్యం, ఆధిపత్యం సాధించకపోతే భారతీయ జనతా పార్టీ (BJP) అధికారాన్ని నిలబెట్టుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3వ దశ పోలింగ్ జరిగిన 16 జిల్లాల్లోని మొత్తం 59 నియోజకవర్గాల్లో దాదాపు ప్రతి సీటులోనూ గట్టి పోటీ నెలకొన్న పరిస్థితి ఉంది. హత్రాస్, ఫిరోజాబాద్, కాస్‌గంజ్, ఎటా, మైన్‌పురి, ఫరూఖాబాద్, కన్నౌజ్, ఇటావా, ఔరయ్య, కాన్పూర్ రూరల్, కాన్పూర్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్, హమీర్‌పూర్, మహోబా జిల్లాల్లో జరిగిన 3వ దశ పోలింగ్ సరళిని ప్రధాన రాజకీయ పార్టీలు విశ్లేషించుకుంటూ, తమ బలాబలాలు, విజయావకాశాలను లెక్కించుకుంటున్నాయి.
‘యాదవ్ బెల్ట్’లో ఎవరిది పైచేయి?
3వ రౌండ్ పోలింగ్ జరిగిన 16 జిల్లాల్లో 8 జిల్లాల్లో యాదవుల సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. అందుకే ఈ 8 జిల్లాలను కలిపి రాజకీయంగా ‘యాదవ్ బెల్ట్’ అంటూ సంబోధిస్తుంటారు. సమాజ్‌వాదీ పార్టీకి ఈ జిల్లాలు ఆయువుపట్టు. అందుకే ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీకి ఇక్కణ్ణుంచే పోటీకి దిగారు. కర్హల్ (మెయిన్‌పురి) పోటీ చేయడం ద్వారా ‘యాదవ్ బెల్ట్’ను హై-వోల్టేజ్ ప్రచార కేంద్రంగా మార్చారు. అఖిలేష్ యాదవ్.. బాబాయ్ శివపాల్ యాదవ్ జస్వంత్ నగర్ (ఇటావా) నుంచి తన సీటును నిలబెట్టుకోవాలనే ఆశతో పోటీ చేయడంతో మూడో రౌండ్ ప్రాధాన్యత సంతరించుకుంది. 1996 నుంచి జస్వంత్ నగర్ స్థానంపై యాదవ్ పరివార్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. యాదవుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మెయిన్‌పురి నుంచే ములాయం సింగ్ ఎంపీగా ఉన్నారు. దీంతో కర్హల్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ వంటి హేమాహేమీలు ప్రచారం నిర్వహించారు. మొత్తంగా అఖిలేశ్, శివ్‌పాల్ యాదవ్ వంటి పెద్ద నేతల పోటీ, ములాయం ప్రచారం మెయిన్‌పురి, ఇటావా, ఎటా, కస్‌గంజ్, ఫిరోజాబాద్, ఔరైయా, కన్నౌజ్, ఫరూఖాబాద్ జిల్లాలతో కూడిన “యాదవ్ బెల్ట్”లో తమ ఓటుబ్యాంకులో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపాయి.
యాదవులకు ఇంత బలమైన ప్రాంతంలో బీజేపీ తమ సాంప్రదాయ ఓటుబ్యాంకు అగ్రవర్ణాలతో పాటు యాదవేతర ఓబీసీ(OBC)లు, మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (MBC) ను తమవైపునకు తిప్పుకోవడం, దళితుల్లో సైతం ‘జాటవ్’యేతర వర్గాలను ఆకట్టుకోవడంతో 2017లో సమాజ్‌వాదీ పార్టీని 6 సీట్లకే పరిమితం చేయగలిగింది. యాదవ్ బెల్ట్ పరిధిలోని 29 సీట్లలో బీజేపీ 23 గెలుచుకోగలిగింది. 2012లో ఎస్పీ ఇక్కడ 25 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం ఒక్క సీటునే గెలుచుకుంది. మిగతా మూడు సీట్లలో బీఎస్పీ రెండు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. ఇప్పుడు 2012, 2017 తరహాలో ఓటర్లు ఎటైనా ఒకవైపే పూర్తిగా మొగ్గుచూపే పరిస్థితులు లేవు. తమ ఓటమికి కారణమైన యాదవేతర ఓబీసీలు, ఎంబీసీల్లోకి సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ కొంతమేర విస్తరించగలిగింది. మరోవైపు ఫిరోజాబాద్, ఫరూఖాబాద్, కన్నౌజ్, కాన్పూర్ నగరాల్లో ముస్లింల జనసంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎలాగూ సమాజ్‌వాదీకి సహజసిద్ధ అనుకూల వాతావరణం ఉంటుంది. బీజేపీ విషయానికొస్తే గత ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు ఆ పార్టీకి ‘లబ్దిదారుల సమూహాన్ని’ తయారు చేసిపెట్టాయి. వీరంతా బీజేపీ నిశ్శబ్ద ఓటర్లేనని అంచనాలున్నాయి. మొత్తంగా ఈసారి సమాజ్‌వాదీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెయ్యి ఓట్ల లోపు తేడాతో గెలుపోటములున్నా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ దశ బీజేపీ, ఎస్పీ రెండింటికీ అత్యంత కీలకంగా మారింది. మొదటి రెండు దశల్లో నష్టాన్ని తగ్గించుకోవాల్సిన అనివార్య పరిస్థితిలో బీజేపీ ఉంటే, మిగతా రౌండ్లలోనూ బలమైన ప్రదర్శన చూపిస్తే తప్ప అధికార పీఠం అందుకోలేని పరిస్థితిలో సమాజ్‌వాదీ పార్టీ ఉంది.
బుందేల్‌ఖండ్‌లో త్రిముఖ పోరు..
3వ దశ పోలింగ్ జరిగిన బుందేల్‌ఖండ్‌లోని ఐదు జిల్లాల్లో మొత్తం 19 స్థానాల్లో బీజేపీ గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. 21%పైగా దళిత జనాభా కల్గిన ఈ ప్రాంతంలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఆధిపత్యాన్ని చాటేది. 2017లో ఆ పరిస్థితి తారుమారైంది. తమ కంచుకోటలాంటి ఈ ప్రాంతంలో మళ్లీ సత్తా చాటేందుకు మాయావతి తీవ్రంగా ప్రయత్నించారు. ఒకప్పుడు బందిపోటు ముఠాల అడ్డాగా ఉన్న బుందేల్‌ఖండ్‌లో, ఆ ముఠాలను నిర్మూలించి శాంతి నెలకొల్పింది తానేనని చెప్పుకున్నారు. సమాజ్‌వాదీ, బీజేపీల పాలనలో ఇక్కడ మళ్లీ శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. బీఎస్పీతో మాత్రమే శాంతి నెలకొంటుందని చెప్పారు. తాగునీటి ఎద్దడికి చిరునామాగా నిలిచిన ఈ ప్రాంతంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ‘హర్ ఘర్ నల్’ (ప్రతి ఇంటికి నల్లా) పథకం ద్వారా తాగునీటి సమస్యలను తీర్చే ప్రయత్నం చేసింది. అలాగే బుందేల్‌ఖండ్ ఎక్స్ ప్రెస్ వేతో ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నం చేసింది. కొత్తగా డిఫెన్స్ కారిడార్, నదుల అనుసంధానంలో భాగమైన కెన్-బెట్వా లింక్ ప్రాజెక్టులను చేపట్టింది. మరోవైపు సంక్షేమ పథకాలతో ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకుంది. ఇదిలా ఉంటే బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా కనిపిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈసారి ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో బుందేల్‌ఖండ్‌లో ప్రధానంగా బీజేపీ Vs బీఎస్పీగా కనిపిస్తున్నా, ఎస్పీ కూడా కీలక పాత్ర పోషిస్తూ త్రిముఖ పోటీ నెలకొనేలా చేయగలిగింది.
Also Read..
UP Assembly Elections: మోడీ-యోగి సర్కార్లపై ఫైర్.. వర్చువల్ ర్యాలీలో ప్రసంగించిన సోనియా..