లక్నో, ఆగస్టు 7: భారీ వర్షాలకు ఉత్తరాది అల్లకల్లోలంగా ఉంది. వాగులు, నదులు ఉగ్రరూపం దాల్చి పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కేరళ, చెన్నై, దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో నదుల్లో, అడవుల్లో ఉండాల్సిన మూగజీవాలు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల మొసళ్లు గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఘటనలకు సంబంధించిన వీడియోలు హల్‌చల్ చేశాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాకు చెందిన ఓ వీడియోలో వీధుల్లో మొసలి పాకుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
బుధవారం (ఆగస్టు 7) ఉదయం నంగల్ సోటి గ్రామంలోని వీధుల్లో ఓ ముసలి షికారు చేస్తూ కనిపించింది. మొసలి గ్రామ వీధుల్లోకి ప్రవేశించి స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. అయితే మొసలి మాత్రం ఎవరికీ హాని తలపెట్టకుండా వీధిలో పాకుతూ వెళ్లడం వీడియోలో చూడొచ్చు. వీడియోలో ఓ వ్యక్తి మొసలి దగ్గరకు వెళ్లి దానిని కాలితో తన్నడం కనిపిస్తుంది. కానీ మొసలి ఏం పట్టించుకోకుండా, దాని మానాన అది వెళ్లడం చూడొచ్చు.
बिजनौर : जंगल से निकलकर गांव में घुसा मगरमच्छ
गांव की गलियों में घंटों तक टहलता रहा मगरमच्छ
वन विभाग की टीम ने मगरमच्छ का किया रेस्क्यू
बिजनौर के नांगल सोती गांव का मामला@bijnorpolice @UpforestUp #Bijnor #UPNews pic.twitter.com/rqmbAdUWAa
— News1India (@News1IndiaTweet) August 7, 2024
ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో వరద ప్రవాహానికి ఓ మొసలి దారి తప్పి జనావాసంలోకి ప్రవేశించింది. ఈ రోజు ఉదయం తెల్లవారు జామున వీధి కుక్కలు అరుస్తుండటంతో స్థానికులు రోడ్డుపైకి వచ్చి చూడగా.. వారికి మొసలి కనిపించింది. గ్రామంలో మొసలి దాదాపు 3 గంటలపాటు సంచరించింది. గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. సమాచారం అందిన రెండు గంటల తర్వాత వారు గ్రామానికి చేరుకుని మొసలిని పట్టుకుని వెళ్లారు.