
Digital Rangoli In Ayodhya : జనవరి 22న అయోధ్యలోని చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.. అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆలయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రతిరోజూ లక్షలాది మంది అయోధ్యలో దర్శనం కోసం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రోడ్లపై గతంలో ఎన్నడూ చూడని అందమైన, అపూర్వమైన దృశ్యం కనువిందు చేసింది. అయోధ్యకు వస్తున్న భక్తులు కూడా ఈ దృశ్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. అయోధ్య వీధులు మునుపెన్నడూ చూడని విశిష్టమైన అందమైన రూపాన్ని అద్దుకున్నాయి.
అయోధ్యలోని రోడ్లను డిజిటల్ రంగోలీలతో అలంకరించారు. అంతేకాదు.. రహదారి పొడవునా ఉన్న విద్యుత్ స్తంభాలను కూడా వివిధ అందమైన డిజైన్లలో రంగురంగుల లైట్లతో ప్రకాశింపజేశారు. రామభక్తులు ఈ సుందర దృశ్యాన్ని చూసి చాలా సంతోషించారు. చాలా మంది రామ భక్తులు ఈ రంగోలిలతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
రోడ్డుపై కొంత దూరం నుంచి కనిపించే రంగురంగుల లైట్ల రంగోలిలు అయోధ్య సందర్శకులకు ఆకర్షణగా మారుతున్నాయి. వాటిలో, హనుమాన్‌గర్హి ఆలయ ప్రవేశద్వారం వద్ద గీసిన ఈ డిజిటల్ రంగోలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయోధ్యలో తొలిసారిగా ఈ తరహా డిజిటల్ రంగోలి గీశారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. రాంలాల్లా దర్శనానికి వచ్చే భక్తులకు సాదరంగా స్వాగతం పలుకుతుంది అయోధ్యానగరి.
వీధుల్లో వెలసిన డిజిటల్ రంగోలిలు చూడటానికి చాలా అందంగా ఉన్నాయని, దీంతో అయోధ్య వాతావరణం మరింత భక్తిపారవశ్యంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం అభినందనీయమని, తమ ఉత్సాహాన్ని మరింత పెంచిందని రామ భక్తులు అంటున్నారు.
#WATCH | Uttar Pradesh: Ayodhya streets adorned with digital rangoli; visuals from Hanumangarhi Temple entry road. pic.twitter.com/0MsmC6cPUX
— ANI (@ANI) February 1, 2024
రామలల్లా విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి లక్షలాది మంది భక్తులు కాలినడకన అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇప్పటివరకు 22 లక్షల మందికి పైగా భక్తులు అయోధ్య లోని బాలరాముడిని దర్శించుకున్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయోధ్యకు వచ్చే భక్తులు ఈ అందమైన డిజిటల్ రంగోలిలను సాయంత్రం వేళలో రామ మందిరం వైపు వెళ్లే రహదారులపై చూడవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…