Gajendrasingh Shekhawat – CM KCR: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిర్మాణాన్ని ఆపాలని ఇప్పటికే.. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, కృష్ణా నది మేనేజ్‌మెంట్ బోర్డ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు శుక్రవారం ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, ఎస్టీటీ ఆదేశాలపై సీఎం కేసీఆర్‌తో ఆయన చర్చించినట్లు సమాచారం. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి కృష్ణాబోర్డు బృందాన్ని పంపుతామని.. పనులు జరుగుతున్నాయో.? లేదో.? అనే విషయాలను కమిటీ పరిశీలిస్తుందని సీఎం కేసీఆర్‌తో కేంద్ర మంత్రి షెకావత్ అన్నట్లు తెలిసింది. దీంతోపాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పలు అంశాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం. అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం.. జల్‌శక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కాగా..రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఆపాలన్న తెలంగాణ ఫిర్యాదుపై కృష్ణా నది మేనేజ్‌మెంట్ బోర్డ్ ఇటీవల స్పందించింది. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ముందుకు వెళ్లకూడదని ఏపీని ఆదేశించింది. దీనిపై డీపీఆర్ సమర్పించాలని కృష్ణా మేనేజ్‌మెంట్ బోర్డ్ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ, ఫొటోలను దీనికి జత చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బోర్డు లేఖ రాసింది. ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. డీపీఆర్ ఇవ్వకుండా, అత్యున్నత మండలి ఆమోదం లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టరాదన్న బోర్డు ఆదేశించింది.
Also Read: