Union Cabinet on Farm Laws: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021’ను ఆమోదించింది కేబినెట్. అలాగే, మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు కలిపి ఒకే బిల్లును రూపొందించినట్లు సమాచారం. దీంతో ఈ నెల 29 నుంచి మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజునే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమవుతోంది.
ఇదిలావుంటే, కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు దాదాపు సంవత్సర కాలంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్నాయి. ఈ నిరసనలు ప్రారంభమై ఈ నవంబర్ 26 నాటికి దాదాపు ఏడాది కానుంది. ఇదే సమయంలో సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులను ఉద్ధేశించి ప్రకటన చేశారు. కాగా, ఇందుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను ఈ శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగానే కేంద్రప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
అలాగే, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు కొన్ని మినహా మిగతా ప్రైవేటు క్రిప్టో కరెన్సీల రద్దు,నియంత్రణ, అధికారికంగా డిజిటల్ ద్రవ్యాన్ని జారీ చేయడానికి ఆర్‌బీఐని అనుమతించడం వంటి అంశాలతో పాటు మొత్తం 26 బిల్లుల్ని ఈ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా ‘విత్తనాలపై బిల్లు’ను కూడా పార్లమెంటు ఆమోదానికి తేనుంది. వీటితోపాటు విద్యుత్తు సవరణ బిల్లు, ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో బిల్లును తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. వీటికి సంబంధించి నేటి మంత్రివర్గ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్లు సమాచారం.