BJP: ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. రాష్ట్ర మంత్రి యశ్‌పాల్ ఆర్య తన కుమారుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరడం సంచలనం రేపింది. ఈ అనూహ్య పరిణామం ఉత్తరాఖండ్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బేనని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్ర మంత్రి యశ్‌పాల్ ఆర్యా బీజేపీకి రాజీనామా చేయడం ..కాంగ్రెస్‌లో చేరడం సంచలనం రేపింది. మంత్రి యశ్‌పాల్ ఆర్యతో పాటు ఆయన కుమారుడు ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే సంజీవ్ కూడా కాంగ్రెస్‌లో చేరారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఉత్తరాఖండ్ కేబినెట్‌లో రవాణశాఖ మంత్రిగా ఉన్న యశ్‌పాల్ హస్తం పార్టీ గూటికి చేరడం సంచలనం రేపింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీతో కూడా తన కుమారుడితో కలిసి భేటీ అయ్యారు. యశ్‌పాల్ ఆర్య చేరికతో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్. తరచుగా సీఎంలను మారుస్తున్న బీజేపీకి ఉత్తరాఖండ్ ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు .
యశ్‌పాల్ ఆర్య 2007 నుంచి 2014 వరకు ఉత్తరాఖండ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో హరీశ్ రావత్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యశ్‌పాల్ ఆర్య బీజేపీలో చేరారు. ముక్తేశ్వర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కుమారుడు సంజీవ్ నైనిటాల్ స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యవ వహిస్తున్నారు. యశ్‌పాల్ ఆర్యను అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. గత కొద్దికాలంగా ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతల మాత్రంం ఆయన పార్టీ లోనే కొనసాగుతారని తెలిపారు. కాని వాళ్లకు షాకిస్తూ యశ్‌పాల్ ఆర్య తన కుమారుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.