హస్తిన అల్లర్ల కేసులో అరెస్ట్‌లను మొదలుపెట్టిన ఢిల్లీ పోలీసులు

|

Sep 14, 2020 | 11:59 AM

హస్తిన అల్లర్ల కేసు విచారణలో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు.. సీఏఏ-ఎన్‌ఆర్‌సీ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారడం.. ఆ అల్లర్లలో అధికారికంగా 53 మంది పౌరులు మరణించడం తెలిసిన విషయాలే..

హస్తిన అల్లర్ల కేసులో అరెస్ట్‌లను మొదలుపెట్టిన ఢిల్లీ పోలీసులు
Follow us on

హస్తిన అల్లర్ల కేసు విచారణలో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు.. సీఏఏ-ఎన్‌ఆర్‌సీ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారడం.. ఆ అల్లర్లలో అధికారికంగా 53 మంది పౌరులు మరణించడం తెలిసిన విషయాలే.. దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఆ సంఘటన హింసాత్మకంగా మారడానికి కొందరు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలేనని, వారు రెచ్చగొట్టడం వల్లనే ఆందోళన ఉద్రిక్తంగా మారిందని పోలీసులు ఆరోపించారు.. కోర్టులో అలా ఛార్జ్‌షిట్‌ దాఖలు చేశారు.. ఈ నేపథ్యంలోనే జవహర్‌లాల్‌ యూనివర్సిటీ- జెఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, యునైటెడ్‌ ఎగైనెస్ట్ హేట్‌ కార్యకర్త ఉమర్‌ ఖలీద్‌ను నిన్న అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు.. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక సంఘటనలకు బాధ్యులుగా భావిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం -ఉపా కింద ఉమర్‌ ఖలీద్‌ను అరెస్ట్‌ చేసినట్టు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఖలీద్‌ తండ్రి మాత్రం తన కుమారుడిని అక్రమ చట్టం కింద అరెస్ట్‌ చేశారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి మరికొందరిని కూడా అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతిఘోష్‌, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫశ్రీసర్‌ అపూర్వానంద్‌, స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ రాహుల్‌రాయ్‌లపై ఇంతకు ముందే ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షిట్‌ దాఖలు చేశారు. వీరితో పాటు భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే మతీన్‌ అహ్మద్‌, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్‌ వంటి నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దేశ వ్యతిరేక కుట్ర పేరుతో ఏచూరి పేరును ఇరికించడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుపట్టడంతో పోలీసులు చార్జ్‌షిట్‌లో ఏచూరి పేరు లేదని వివరణ ఇచ్చుకున్నారు.