దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల హతం.. కొనసాగుతోన్న కూంబింగ్..

|

Mar 27, 2024 | 12:28 PM

దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ జిల్లాలోని చికుర్‌బత్తి-పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పలువురు జవాన్లు గాయపడ్డట్లు సమాచారం.

దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల హతం.. కొనసాగుతోన్న కూంబింగ్..
Encounter
Follow us on

దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ జిల్లాలోని చికుర్‌బత్తి-పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పలువురు జవాన్లు గాయపడ్డట్లు సమాచారం. ఘటనాస్థలం నుంచి భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో బుధవారం ఉదయం నుంచి భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. పోలీసు ఇన్‌ఫార్మర్లు అనే అనుమానంతో ముగ్గురు గ్రామస్తులను హత్య చేసిన కొద్ది రోజుల తర్వాత పోలీసులు భారీ కూంబింగ్ నిర్వహించారు.

డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కోబ్రా దళాలు కూంబింగ్ జరుపుతున్న క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. బలగాలు, మావోయిస్టులు ఇరువైపుల జరిగిన హోరాహోరి కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. ఈ ఎన్‌కౌంటర్ అనంతరం బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు బస్తర్​ రేంజ్ ఐజీ సుందర్​రాజ్​ తెలిపారు.

కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో 37 మంది మావోయిస్టులు హతమవ్వగా.. ఆరుగురు భద్రతా సిబ్బంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలాఉంటే.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీజాపుర్‌ జిల్లా బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది.. ఈ స్థానానికి ఏప్రిల్‌ 19న తొలి విడతలోనే పోలింగ్‌ జరగనుండటంతో ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా యాంటీ-నక్సల్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..