ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్ఛు రేపాయి. నేతల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలు, లుకలుకలు బయటపడ్డాయి. ఈ ఎన్నికల్లో రెండోసారి కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచింది. అయితే పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం చేసిన ఓ ట్వీట్ వివాదం రేపుతోంది. ఢిల్లీ ఎలక్షన్స్ లో బీజేపీని ఓడించిన ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా అంటూ ఆయన ట్వీటించారు. అసెంబ్లీలోని 70 సీట్లకు గాను ఆప్ 62 సీట్లలో విజయం సాధించగా, బీజేపీ 8 స్థానాలకే పరిమితమైన సంగతి విదితమే. 2013 వరకు 15 ఏళ్ళ పాటు ఇక్కడ అధికారంలో ఉంటూ వచ్చిన కాంగ్రెస్ పూర్తిగా చతికిలబడింది. 63 సీట్లలో ఈ పార్టీ అభ్యర్థులు తమ డిపాజిట్లు కోల్పోయారు. ప్రచారం చివరి రోజుల్లో పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విస్తృతంగా ర్యాలీల్లో పాల్గొన్నా ప్రయోజనం లేకపోయింది.
‘ఆప్ గెలిచింది. బ్లఫ్ అండ్ బ్లాస్టర్ (ప్రగల్భాలు పలికే పార్టీ)ఓడిపోయింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ఢిల్లీ ప్రజలు.. విభజన రాజకీయాలు చేసే, ప్రమాదకరమైన ఎజెండాతో కూడిన బీజేపీని ఓడించారు. వీరికి నేను సెల్యూట్ చేస్తున్నా.. 2021-2022 సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లోనూ ప్రజలు ఇదే తరహాలో ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలి’ అని చిదంబరం తన ట్వీట్లో కోరారు.
అయితే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె అయిన శర్మిష్ట ముఖర్జీ.. ఈ ట్వీట్ కు ఘాటుగా స్పందించారు. ‘బీజేపీని ఓడించే బాధ్యతను ప్రాంతీయ పార్టీలకు ఔట్ సోర్సింగ్ కు ఇచ్చారా ?’ అని ప్రశ్నించారు. ‘అలా కాకపోతే.. మన పార్టీ ఘోర ఓటమిపై కూలంకష ఆత్మపరిశీలన చేసుకోకుండా ఆప్ విజయం మీద అంత మెచ్చుకోలు ఎందుకు ? ఇలా అయితే ఆయా రాష్ట్రాల్లోని మన పీసీసీలను మూసుకోవలసిందే ‘ (మన దుకాణాలు బంద్ చేసుకోవలసిందే) అని ఆమె పేర్కొన్నారు. అక్కడితో ఆమె ఆగలేదు. ‘ఢిల్లీలో మళ్ళీ మనకు చుక్కెదురైంది. చేసుకున్న ఆత్మపరిశీలన చాలు.. ఇప్పుడు కార్యాచరణ కావాలి.. ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో అసాధారణ జాప్యం జరుగుతోంది. రాష్ట్ర స్థాయిల్లో పార్టీలో సమైక్యత కోసం ఒక వ్యూహమంటూ పన్నలేకపోతున్నాం.. కార్యకర్తల్లో మనో స్థైర్యం లోపించింది. క్షేత్ర స్థాయిలో వారికి కనెక్ట్ కాలేకపోతున్నాం.. ‘ అని శర్మిష్ట అన్నారు. బీజేపీ విఛ్చిన్నకర రాజకీయాలు చేస్తుంటే కేజ్రీవాల్ ‘స్మార్ట్ పాలిటిక్స్’ ఆడుతున్నారు. మనమేం చేస్తున్నాం, ‘ అని ఆమె ప్రశ్నించారు. మనమంతా ఈ పార్టీని ఒక ఆర్దర్లో పెడుతున్నామా అన్నారు. కాంగ్రెస్ పార్టీనే మనం క్రమంలో పెట్టలేకపోతే.. ఇతర పార్టీలు మాత్రం ఇండియాకు సంబంధించి అదే పని చేస్తున్నాయి అన్నారు. మనం సర్వైవల్ కావాలంటే మన భ్రాంతి భావనల నుంచి బయటపడే సమయం ఆసన్నమైంది అని శర్మిష్ట దీటైన సూచన ఇఛ్చారు.
ఖుష్బూ సుందర్, సంజయ్ ఝా వంటి ఇతర నేతలు కూడా ‘ఆత్మపరిశీలన బదులు కార్యాచరణ కావాలంటూ’ సూచించారు. 2015 లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళా విభాగం చీఫ్ కూడా అయిన శర్మిష్ట ముఖర్జీ ఓటమి చవి చూశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం ఏ అసెంబ్లీ ఎన్నికల శాతానికైనా చాలావరకు తగ్గిపోయింది. గత ఏడాది జనరల్ ఎన్నికల్లో ఈ శాతం 22.5 ఉండగా.. ఈ సారి ఇది 4.26 శాతానికి దిగజారింది. 2013 లో కాంగ్రెస్ 8 స్థానాలు దక్కించుకోగా 2015 లో అంతర్గత కుమ్ములాటల ఫలితంగా జీరో స్థానానికి పూర్తిగా పడిపోయింది.
With due respect sir, just want to know- has @INCIndia outsourced the task of defeating BJP to state parties? If not, then why r we gloating over AAP victory rather than being concerned abt our drubbing? And if ‘yes’, then we (PCCs) might as well close shop! https://t.co/Zw3KJIfsRx
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) February 11, 2020