
తమకు నచ్చినట్టు ఉంటే సరి.. లేదంటే ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేయాలి. ఇది అగ్రరాజ్యం అమెరికా తీరు. ఇతర దేశాల విషయంలో దశాబ్దాలుగా ఆ దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం కూడా ఇదే అనవచ్చు. తమ అవసరాలకు తగ్గట్టుగా మిగతా దేశాలు వ్యవహరించాలి… లేదంటే ఆయా దేశాల్లో ప్రభుత్వాలనే కూల్చేసి తమకు నచ్చినవారిని కుర్చీలో కూర్చోబెట్టాలి అన్నట్టుగా అమెరికా (USA) వ్యవహరిస్తోంది. అలాగే తమ ఆయుధాలు అమ్ముకోవడం కోసం కొన్ని దేశాల మధ్య చిచ్చు రాసేయడం కూడా ఆ దేశానికి అలవాటే అన్న ఆరోపణలు చాలాకాలంగానే ఉన్నాయి. డెమోక్రాట్లు, రిపబ్లికన్లలో ఎవరు అధికారంలో ఉన్నా సరే వారి విధానంలో పెద్దగా మార్పు ఉండేది కాదు. కానీ ఇది గతం. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల వ్యవహారాల్లో సైతం గత విధానాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు, తమ ప్రత్యర్థి పార్టీ డెమోక్రాట్లు అధికారంలో ఉన్నప్పుడు.. మరీ ముఖ్యంగా గత జో బైడెన్ హయాంలో చేసిన చీకటి పనులన్నీ బహిర్గతం చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. అలా బయటపడ్డదే.. భారత్‌లో మోదీ సర్కారును కూల్చేందుకు బైడెన్ సర్కారు పన్నిన కుట్ర. అవును.. పదేళ్లుగా భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. సైనిక శక్తిని సైతం పెంపొందించుకుంటోంది. ఇది నచ్చని జో బైడెన్ సర్కారు.. భారత్‌లో నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారు. స్వయంగా అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలివి.ఈ కథనం కూడా చదవండి
తమకు నచ్చిన దేశాలకు వివిధ రూపాల్లో సహాయం అందించడం కోసం ఉద్దేశించిన “యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్” (USAID) నిధులను తమకు నచ్చని ప్రభుత్వాలను కూల్చేందుకు ఉపయోగించారన్నది ట్రంప్ ప్రకటన సారాంశం. భారత్‌లో ఓట్ల శాతం పెంచడం కోసం అంటూ ఏకంగా 21 మిలియన్ డాలర్ల USAID నిధులను భారత్‌లోని బీజేపీ – మోదీ వ్యతిరేక శక్తులకు అందజేసింది. భారత్‌లోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, పత్రికలు, మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలకు నిధులు అందజేసి వ్యతిరేక కథనాలు వండి వార్చింది. ఈ మొత్తం క్రతువులో కీలక పాత్ర పోషించింది ఎవరో కాదు.. ఓ తెలుగు మహిళ. USAID ఇండియా చీఫ్‌గా పనిచేసిన ఆ మహిళ పేరు వీణా రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన వీణా రెడ్డి అమెరికా రాయబారిగా ఎదిగారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి డిగ్రీ, పీజీ చేసిన ఆమె కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి డాక్టరేట్ కూడా పొందారు. అమెరికా ప్రభుత్వంలోని ఫారిన్ సర్వీసెస్ కార్యాలయంలో చేరక ముందు ఆమె న్యూయార్క్, లండల్, లాస్ ఏంజెల్స్ వంటి మహానగరాల్లో కార్పొరేట్ అటార్నీగా పనిచేశారు. న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ కౌన్సిల్ సభ్యురాలిగా కూడా ఉన్నారు. 2021 ఆగస్టు 5న USAID సంస్థకు చెందిన భారత కార్యాలయంలో డైరెక్టర్ గా పదవీబాధ్యతలు చేపట్టారు. 2024లో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత జులై 17న తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అంతకంటే ముందు USAID పాకిస్తాన్, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, సెంట్రల్ అమెరికా విభాగాల్లో పనిచేశారు.
అమెరికా రాయబార కార్యాలయం ప్రకారం, భారత్, భూటాన్ దేశాల్లో USAID సంస్థకు నాయకత్వం వహించిన మొదటి భారతీయ అమెరికన్ మహిళగా వీణా రెడ్డి రికార్డుల్లోకి ఎక్కారు. ఆమె భారత్ రాక ముందు కంబోడియాలో USAID మిషన్‌కు నాయకత్వం వహించారు. అలాగే హైతీలో డిప్యూటీ మిషన్ హెడ్‌గా కూడా పనిచేశారు. ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లలో USAID కార్యక్రమాలకు చట్టపరమైన విషయాలను కవర్ చేస్తూ, ఏజెన్సీతో అసిస్టెంట్ జనరల్ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుండి వీణా రెడ్డి భూటాన్‌లో USAID కార్యకలాపాలకు కూడా నాయకత్వం వహించారు.
ఆమె USAID ఇండియా విభాగం డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలోనే నిధుల ప్రవాహం పెరిగింది. 2020లో 83.2 మిలియన్ డాలర్ల నిధులు అందుకోగా.. 2021లో 94.3 మిలియన్ డాలర్లు, 2022లో అత్యధికంగా 228 మిలియన్ డాలర్ల నిధులు భారత్‌కు అందాయి. 2001 నుంచి వచ్చిన నిధులతో పోల్చి చూస్తే 2022లో అందిన మొత్తమే పెద్దది.
భారత అధికారిక గణాంకాల ప్రకారం 2022లో వచ్చిన $228 మిలియన్ల నిధి నుంచి ప్రాథమిక ఆరోగ్యంపై $140.7 మిలియన్లు (లేదా దాదాపు 50%), తల్లి, పిల్లల ఆరోగ్యంపై $25.09 మిలియన్లు, HIV/AIDS నివారణ మరియు అవగాహన కార్యక్రమాలపై $10.57 మిలియన్లు, సాధారణ పర్యావరణ పరిరక్షణపై $7.186 మిలియన్లు, ఇంధన వనరులపై $5.6 మిలియన్లు ఖర్చు చేసింది.
USAID ఇండియా మిషన్ డైరెక్టర్‌గా 3 సంవత్సరాల పదవీకాలంలో ఆమె ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, విద్య, సామాజిక సేవలు, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు మరియు పాలన మొదలైన రంగాలలో వివిధ ప్రాజెక్టులను పర్యవేక్షించారని US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ తెలిపింది. భారత రైల్వేలు, విద్యుత్ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (NPTI), పవర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, NTPC గ్రీన్ నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాల్లో USAID నిధులను వీణా రెడ్డి న్యూఢిల్లీలో వినియోగించారు. డిజిటల్ చెల్లింపుల ప్రమోషన్, ఆరోగ్యం, అటవీ మరియు విద్య వంటి వాటికి సంబంధించిన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, పర్యవేక్షించడానికి ఆమె అనేక రాష్ట్రాలను సందర్శించారు.
భారత మిషన్ డైరెక్టర్‌గా, మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల ఆహ్వానం మేరకు ఆమె వివిధ ఉన్నత స్థాయి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్నారు. నవంబర్ 2023లో, అప్పటి పట్టణ గృహనిర్మాణ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షతన జరిగిన ప్రపంచ టాయిలెట్ దినోత్సవ కార్యక్రమంలో ఆమె వక్తగా ఉన్నారు. జూలై 2023లో, ఆమె భారతదేశ అధ్యక్షతన జరిగిన G20 విపత్తు ప్రమాద తగ్గింపు వర్కింగ్ గ్రూప్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. అయితే అధికారిక కార్యక్రమాల మాటున.. చాటుగా USAID నిధులను Voter Turnout in India (భారత్‌లో ఓట్ల శాతం) పెంచడం కోసం 21 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారన్నది ప్రస్తుత అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణ. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ మహేశ్ జెఠ్మలానీ డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఇదంతా వీణా రెడ్డికి తెలిసే జరిగిందా లేక ఆమె కూడా ఇందులో ఒక పావుగా మారారా అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.