గుడ్‌న్యూస్: కేబుల్‌ టీవీ, డీటీహెచ్ బిల్లుల తగ్గింపుకు ట్రాయ్ కొత్త యాప్

|

Jun 27, 2020 | 1:59 PM

టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా డీటీహెచ్, కేబుల్ టీవీ యూజర్లకు తీపికబురు అందించింది. మళ్లీ ధరల విధానంలో మరింత పారదర్శకత, వినియోగదారులకు భారం తగ్గించేందుకు కొత్తగా ఓ యాప్‌ను విడుదల చేసింది..

గుడ్‌న్యూస్: కేబుల్‌ టీవీ, డీటీహెచ్ బిల్లుల తగ్గింపుకు ట్రాయ్ కొత్త యాప్
Follow us on

టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా డీటీహెచ్, కేబుల్ టీవీ యూజర్లకు తీపికబురు అందించింది. గతంలో కొత్త ధరల విధానాన్ని ఆవిష్కరించిన ట్రాయ్ పలు విమర్శలు ఎదుర్కొంది. కొత్త విధానంతో ధరలు తగ్గలేదని, ఇంకా పెరిగాయని టీవీ యూజర్లు ఆరోపించారు. అయితే ఇప్పుడు ట్రాయ్ మళ్లీ ధరల విధానంలో మరింత పారదర్శకత, వినియోగదారులకు భారం తగ్గించేందుకు కొత్తగా ఓ యాప్‌ను విడుదల చేసింది.

కేబుల్ టీవీ, డీటీహెచ్ వాడుతున్న వినియోగదారులకు బిల్లుల భారం తగ్గించేందుకు ట్రాయ్ కొత్తగా ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. వినియోగదారులు కేబుల్ టీవీ లేదా డీటీహెచ్‌లో చూడాలనుకుంటున్న ఛానెళ్లు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఎంత బిల్లు అవుతుందో ఈ యాప్ ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డిష్‌టీవీ, డీ2హెచ్, టాటాస్కై, హాత్‌వే డిజిటల్, ఏషియానెట్, సిటీ నెట్‌వర్క్, ఇన్‌డిజిటల్ లాంటి డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ ఎంఎస్‌ఓలకు సంబంధించిన అన్ని వివరాలు ఈ యాప్‌లో పొందుపర్చబడి ఉంటాయి. ట్రాయ్ ఛానెల్ సెలక్టర్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో, యాపిల్ ఐఫోన్ యూజర్లకు యాప్ స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంటుందని ట్రాయ్ స్పష్టం చేసింది.

ఇక ఈ కొత్త యాప్‌‌ని ఉపయోగించే విధానం:
యాప్ ఓపెన్ చేసిన తర్వాత సదరు వినియోగదారుడు తమ కేబుల్ లేదా డీటీహెచ్ ఆపరేటర్‌ను సెలెక్ట్ చేయాలి. తర్వాత వారి సబ్‌స్క్రిప్షన్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు వారి మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత కేబుల్ టీవీ, డీటీహెచ్ ఛానెల్ ప్యాక్స్‌ను మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఛానెళ్ల జాబితాలో మరిన్ని ఛానెల్స్ యాడ్ చేసుకోవచ్చు.