టిక్‌టాక్ యూజర్లకు షాకింగ్ న్యూస్..టిక్‌టాక్ పై వేటు పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిషేధాజ్ఞాలు అమలులోకి వచ్చాయి. భారత్- చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా దేశానికి చెందిన 59 యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.. చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేషన్ల వల్ల దేశ భద్రతకే ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో నిఘావర్గాల సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం వాటిని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, జెండర్, షేర్ఇట్, క్లీన్ మాస్టర్ సహా 59 ఇతర మొబైల్ అప్లికేషన్ల ద్వారా డేటా తస్కరణకు గురవుతుందని నివేదికలు అందడంతో వాటిని నిషేధిస్తూ..జూన్ 29న కేంద్రం ప్రకటించింది.
చైనాకు చెందిన 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించగా.. ఆ ఆదేశాలు జూన్ 30న అమలులోకి వచ్చాయి. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌ల నుంచి ఆ 59 యాప్ లను ఆయా స్టోర్స్ నుండి తొలగించారు. గూగుల్ ప్లే స్టోర్ ఇండియా, యాపిల్ యాప్ స్టోర్ ఇండియా టిక్‌టాక్‌ను తొలగించాయి. యాప్ స్టోర్లలో టిక్‌టాక్ కనిపించడం లేదు. ఇకపై కొత్త యూజర్లు ఈ 59 యాప్ లు డౌన్ లోడ్ చేసుకోలేరు..
ఇదిలా ఉంటే, మరోవైపు తమ యాప్‌ను బ్యాన్ చేయడంపై టిక్‌టాక్ స్పందించింది.వినియోగదారుల ప్రైవసీ చలా ముఖ్యమని టిక్‌టాక్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తమ టిక్‌టాక్ యాప్‌తోపాటు మొత్తం 59 చైనీస్ యాప్స్‌ను నిషేధించిందని… దీనిపై సంబంధిత అధికారులను త్వరలోనే సంప్రదిస్తామని చెప్పారు. టిక్‌టాక్ తన యూజర్ల డేటా, ప్రైవసీకి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పింది. వినియోగదారుల సమాచారం విషయంలో భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని..యూజర్లకు చెందిన ఎలాంటి సమాచారాన్ని చైనాతోసహా ఇతర ఏ దేశానికీ తాము చేరవేయలేదని స్పష్టం చేశారు. ఇకపై కూడా వారి డేటాను సురక్షితంగా ఉంచుతామని తెలిపారు.