Building Collapses in Mumbai: మహారాష్ట్రలో మహావిళయం వచ్చింది. వరుణుడు ఒక్కసారిగి దాడి చేస్తున్నాడు. ఈ జిల్లా, ఆ జిల్లా అని లేదు. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చూసినా ఒకటే వానలు. జనజీవనం అస్తవ్యస్తమైంది. కొండచరియలు విరిగిపడి.. వందల గ్రామాలకు కనెక్టివిటీ లేకుండా పోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. ఊళ్లకు ఊళ్లు జలదిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు మహారాష్ట్రలో మరో విషాదం చోటుచేసుకుంది. ముంబై నగరంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మరణించారు. ముంబై నగరంలోని గోవాండి ప్రాంతంలోని శివాజీనగర్‌లో రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి అక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను హుటాహుటీన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ పునరావాస పనులు చేపట్టారు. భారీవర్షాల వల్ల ముంబైలో వేర్వేరు దుర్ఘటనల్లో 30 మంది మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
Maharashtra | Seven people injured, three died after a building collapsed in Govandi area of Mumbai. Details awaited: Mumbai Police
— ANI (@ANI) July 23, 2021
మహాబలేశ్వరంలో 52 ఏళ్లలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో వర్షం పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 48 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. మహారాష్ట్రలో వర్షాలతో గోదావరి, కృష్ణకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. ఇక, రాయ్‌గడ్ జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మహద్‌తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 300 మంది చిక్కుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఐదుగురు ప్రాణాలు కూడా కోల్పోయారు.
రోడ్లు, ధ్వంసం కావడంతో కొల్హాపూర్ జిల్లాలో సుమారు 47 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ఊళ్లు జలదిగ్భంధంలో మునిగిపోయాయి. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ సహాయం కోరింది మహారాష్ట్ర ప్రభుత్వం. బాధితుల్ని రక్షించేందుకు ఆర్మీ, నేవీ బృందాలు రంగంలోకి దిగాయి. అటు నాందేడ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కార్లు వరదలో కొట్టుకుపోతున్నాయి. పాంచగంగలో మోకాళ్లలోతు నీళ్లలో జనం తిప్పలు పడుతున్నారు. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
సతారా జిల్లాలోని నదులన్నీ అతి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలో ఉన్న హైవేలన్నీ జలదిగ్భంధంలో ఉన్నాయి. సుమారు 10 రాష్ట్ర హైవేల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముంబై నుంచి పూణే, నాసిక్, కొంకణ్, ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ నిలిచిపోయాయి.
Read Also…