బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తాం.. ఆన్ లైన్ ప్రచారంలో అమిత్ షా
బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. సీఎం నితీష్ కుమార్ నాయకత్వం కింద ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని..

బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. సీఎం నితీష్ కుమార్ నాయకత్వం కింద ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీహార్ లో ఎన్నికలు రానున్న అక్టోబర్ లేదా నవంబర్ నెలలో జరగనున్నాయి. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆన్ లైన్ ద్వారా ఆదివారం అమిత్ షా ప్రచారం ప్రారంభిస్తూనే.. తన వర్చ్యువల్ ప్రసంగానికి, ఈ ఎన్నికలకు సంబంధం లేదని కూడా పేర్కొన్నారు. గత ఆరేళ్లలో ప్రధాని మోదీ సాధించిన విజయాలను ఆయన వివరించారు. సర్జికల్ దాడుల నుంచి అయోధ్యలో రామాలయం వరకు అన్ని అంశాలనూ ఆయన ప్రస్తావించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. కరోనా వారియర్స్ విషయంలో ఆ పార్టీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో లోకూర్చుని సేద తీర్చుకుంటారా ? లాక్ డౌన్ విధింపును అదే పనిగా విమర్శిస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి నాయకులు బీహార్ ప్రజలను మోసగించడానికి చూస్తున్నారని, వలస కార్మికులతో సహా ప్రజలంతా వారిని దూరం పెట్టాలని ఆయన కోరారు. మైగ్రెంట్ వర్కర్స్ కాలినడకన రోడ్లపై కిలోమీటర్ల దూరం నడచుకుంటూ వెళ్తున్నప్పుడు తమ ప్రభుత్వం వారి కోసం బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసిందని, వారికి ఆహారం, వైద్య సదుపాయాలు కలుగజేసిందని అమిత్ షా వివరించారు. వారి రైలు ప్రయాణాలకు కేంద్రం 85 శాతం ఖర్చును భరించిందని చెప్పారు. పైగా ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు తగిన సూచనలు కూడా ఇస్తూ వచ్చామన్నారు.
లోగడ మోదీ ఓట్ల కోసం ‘జోలె’ (సంచి) పట్టుకుని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆయన సంచిని ‘ఓట్లతో’ నింపివేశారని. బీజేపీకి మంచి మెజారిటీని ఇచ్చారని అమిత్ షా పేర్కొన్నారు. బీహార్ ప్రజలు కేంద్రం సాయాన్ని మరచిపోరన్నారు.



