
Huge response to railway ticket purchase offer: రైల్వే శాఖ ఆఫర్ బంపర్ హిటయ్యింది. ఒక్క రోజులో అంటే కేవలం 24 గంటల్లో ఏకంగా పదమూడు లక్షల మంది రైలు ప్రయాణాల కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. మే 21 (గురువారం) నుంచి రైల్వే టిక్కెట్ల జారీ ప్రారంభం కాగా.. మే 22 మధ్యాహ్నం వరకే 13 లక్షల మంది టిక్కెట్లు కొనుగోలు చేశారని రైల్వే శాఖాధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రత్యేక రైళ్ళను కేవలం రిజర్వేషన్ కేటగిరీలో మాత్రమే నడుపుతున్న రైల్వే శాఖ జూన్ 1వ తేదీ నుంచి సాధారణ రైళ్ళను సైతం ఎంపిక చేసిన రూట్లలో నడిపేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రూట్లను, నడపనున్న రైళ్ళ వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. దాంతో గురువారం ప్రారంభమైన ఆన్ లైన్ టిక్కెట్ల బుకింగ్‌కు భారీ స్పందన వచ్చింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో టిక్కెట్ల బుకింగ్‌కు సిద్దమవడంతో ఒక దశలో ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ మొరాయించింది. సాంకేతిక సమస్యను వెంటనే రెక్టిఫై చేయడంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో టిక్కెట్లను కొనుగోలు చేశారు.
దేశంలోని వివిధ స్టేషన్లను కనెక్టే చేస్తూ మొత్తం 230 రైళ్ళను అన్ని క్లాసులతో ఉన్న రిజర్వేషన్‌లకు రైల్వే శాఖ అనుమతించింది. తొలుగ ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం ప్రారంభించిన రైల్వే శాఖ.. ఆ తర్వాత పలు స్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా కూడా బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. దాంతో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు మొత్తం 13 లక్షల మందికిపైగా ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నారని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.