Covid-19 Third Wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊరట చెందుతున్నారు. అయితే థర్డ్ వేవ్‌కు సంబంధించిన భయం ప్రజలను వణికిస్తోంది. సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ చాలా శక్తివంతంగా ఉంటుందని, ఇందులో ఎక్కువగా చిన్నారులే బాధితులు కావచ్చన్న కొందరు వైద్య నిపుణుల హెచ్చరికులు వణుకు పుట్టిస్తోంది. అయితే థర్డ్ వేవ్ ప్రభావానికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) తాజా అధ్యయన నివేదిక తీపి కబురు చెప్పింది. థర్డ్ వేవ్ పట్ల ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సూచించింది. దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలపై ఐసీఎంఆర్, బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ సంయుక్తంగా ఓ అధ్యయనాన్ని నిర్వహించాయి. ఈ అధ్యయన నివేదికలోని అంశాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురించారు. సెకండ్ వేవ్ తీవ్రత స్థాయిలో థర్డ్ వేవ్ ఉండకపోవచ్చని అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు తేల్చారు. దేశంలో జోరుగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణంగా థర్డ్ వేవ్ అంత శక్తివంతమైనదిగా ఉండే అవకాశం లేదని తమ అధ్యయన నివేదికలో తెలిపారు.
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా పొందిన ఇమ్యునిటీని ప్రజలు పూర్తిగా కోల్పోతే తప్ప..కొత్త వేరియంట్ కారణంగా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని ఆ అధ్యయనంలో తేల్చారు. అలాగే కొత్త వేరియంట్ ద్వారా ఒకరి ద్వారా 4.5 లేదా అంతకంటే ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉంటే తప్ప మరో వేవ్‌కు అవకాశం ఉండదని విశ్లేషించారు. భవిష్యత్తులో కొత్త వేవ్‌లు రాకుండా నిరోధించడంలో వ్యాక్సినేషన్ కీలకం కానుందని నిపుణులు వెల్లడించారు. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నట్లు పేర్కొన్నారు. అలాగే జనసంచార ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్‌ను తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలిని సూచించారు.
మరో రెండు మూడు మాసాల్లోనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందని కొందరు పరిశోధకలు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్‌కు సంబంధించి ఐసీఎంఆర్ తాజా అధ్యయన నివేదిక ఊరట కలిగిస్తోంది.
Also Read..
గర్భిణీ మహిళలకు కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇవ్వవచ్చు.. స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ