Lord Venkateswara Idol: తమిళనాడు రాష్ట్రంలో అతి పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం బయటపడింది. అరియలూర్ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో వేంకటేశ్వర స్వామి విగ్రహం బయల్పడింది. కారయంకురిచి గ్రామానికి చెందిన శరవణన్ తనకు చెందిన స్థంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరిపించాడు. ఈ క్రమంలో రాతి విగ్రహం తగిలినట్లుగా కనిపించడంతో జాగ్రత్తంగా తవ్వకాలు జరిపారు. పూర్తిగా తవ్వి చూడగా.. సుమారు ఎనిమిది అడుగుల స్వామివారి రాతి విగ్రహం కనిపించింది. దాంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు జేసీబీని రప్పించి.. జేసీబీ సహాయంతో విగ్రహాన్ని జాగ్రత్తగా వెలికి తీశారు. గ్రామస్తులు స్వామివారి విగ్రహాన్ని నీటితో శుభ్రపరిచి.. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, స్వామి వారి పురాతన విగ్రహాన్ని అధికారులు తిరుచ్చిలోని పురావస్తు శాఖ కార్యాలయానికి తరలించడానికి ప్రయత్నించగా.. గ్రామస్తులు నిరాకరించారు. విగ్రహాన్ని తరలించేందుకు అంగీకరించలేదు. సీనియర్ అధికారులు ఎంటరై.. గ్రామస్తులతో చర్చలు జరిపించారు. విగ్రహం తరలింపునకు గ్రామస్తులను ఒప్పించారు. అనంతరం స్వామి వారి విగ్రహాన్ని అధికారులు తరలించారు. ఈ పురాతన విగ్రహానికి సంబంధించిన వివరాలు పరిశోధన తరువాత వెల్లడిస్తామని గ్రామస్తులకు అధికారులు హామీ ఇచ్చారు.
ఇదిలాఉంటే.. తిరుమలలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి మూల విరాట్ దాదాపు 9 అడుగులు ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో బయటపడ్డ విగ్రహం 8 అడుగుల పొడవు ఉంది. కాగా, శ్రీవారి విగ్రహం లభ్యమైన ప్రదేశం శ్రీరంగం పట్టణానికి సరిగ్గా 78 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, అత్యంత పురాతన విగ్రహం లభ్యమవడంతో ఇప్పుడు అందరి దృష్టి శ్రీవారి విగ్రహంపైనే పడింది. మరి విగ్రహం ఏ కాలానికి చెందినది, ఎవరు చేయించారనేది తేలాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
Also read:
India vs New Zealand WTC Final: వెంటాడుతున్న జోరు వాన… నాలుగో రోజు ఆట రద్దు.. గెలిచేది మాత్రం…