ఆదివారం తెల్లవారు జామునే మరోసారి జమ్ముకశ్మీర్‌లో కాల్పుల మోత మోగింది. బడ్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. చదోర ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ సాయుధ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు చేపట్టారు. ఘటనాస్థలిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించినట్లు అధికారులు తెలిపారు. మరికొందరు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.