తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదలీ కానున్నారా.? ఆయన స్థానంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ రానున్నారా.? జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో ఆయనను అక్కడికి పంపించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమా? ఈ అన్ని ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు, ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా దాదాపు పది సంవత్సరాలుగా బాధ్యతలు చేపడుతున్న ఈఎస్‌ఎల్ నరసింహన్ బదిలీ కాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే కేంద్రపాలిత ప్రాంతంగా మారనున్న జమ్మూకాశ్మీర్‌కు తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నరసింహన్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఏపీ విభజన సమయంలో ఇక్కడకు వచ్చిన ఆయన.. విభజన ప్రక్రియను, ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు చాలా చొరవ చూపారు. అంతేకాకుండా గతంలో కేంద్ర ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం కూడా ఉండటంతో కేంద్రం నరసింహన్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు జమ్మూకాశ్మీర్ విభజన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరగనుంది. దీంతో అసెంబ్లీ సీట్ల సంఖ్య 107 నుంచి 114కు పెరగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో 87 మంది సభ్యులు ఉండగా.. ఇందులో లడక్ ప్రాంతానికి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు.