
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఆగ్రా రైల్వే స్టేషన్ ట్రాలీ బ్యాగ్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై సమీపంలో ఓ మహిళను అత్యంత కిరాతకంగా చంపి, శరీర భాగాలను బిర్యానీ పాత్రలో దాచిన అమానుష ఘటన వెలుగుచూసింది. ఆగస్టు 5న ఆగ్రా రైల్వే స్టేషన్‌లో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో రెడ్ కలర్ ట్రాలీ బ్యాగ్‌లో తల లేని, కుళ్లిపోయిన మహిళ మొండెం లభ్యమైంది. ఆగ్రా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. మృతురాలు ఒడిశాకు చెందిన హయాతున్ నిషాఅని, ఆమె చెన్నై గూడువాంచేరి ప్రాంతంలో నివసిస్తూ పని చేస్తుందని గుర్తించారు.
దీంతో చెన్నై సెంట్రల్ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ రంగంలోకి దిగాయి. ఆగస్టు 3 రాత్రి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని 4వ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఓ మహిళ, పురుషుడు అనుమానాస్పదంగా ఆ ట్రాలీ బ్యాగ్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల ఆచూకీని చెంగల్పట్టు జిల్లా గూడువాంచేరి మసీదు వీధిలోని ఓ అద్దె ఇల్లుగా గుర్తించారు.
పోలీసులు ఆ ఇంటికి వెళ్లి సోదాలు చేయగా భయానక దృశ్యం కనిపించింది. వంటింట్లో ఉన్న ఓ పెద్ద బిర్యానీ పాత్రలో ముక్కలుగా నరికిన మహిళ శరీర భాగాలు లభ్యమయ్యాయి. దుర్వాసన రాకుండా ఉండేందుకే నిందితులు శరీర భాగాలను ఆ పాత్రలో దాచినట్లు గుర్తించారు. మృతురాలు హయాతున్ నిషా, అసోంకు చెందిన మణిక్ ఉదిన్ లస్కర్, ఒడిశాకు చెందిన భగవతి మాజీతో కలిసి ఆ ఇంట్లో నివసిస్తోంది. వారి మధ్య వచ్చిన వివాదాల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. హత్యానంతరం మొండేన్ని ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి రైలులో వదిలేసి, మిగిలిన భాగాలను ఇంట్లోనే వదిలి నిందితులు పరారయ్యారు.
సంఘటనా స్థలాన్ని ఉన్నతాధికారులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ పరిశీలించి వేలిముద్రలు, రక్తపు నమూనాలను సేకరించాయి. పరారీలో ఉన్న మణిక్ ఉదిన్ లస్కర్, భగవతి మాజీల కోసం ప్రత్యేక బృందాలు అసోం, ఒడిశా రాష్ట్రాలకు బయలుదేరాయి. వివాహేతర సంబంధమా లేక ఆర్థిక లావాదేవీల వల్ల ఈ దారుణం జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.