తమిళనాడు రాజకీయాలంటే అందరికీ ఆసక్తే! అందుకంటే అక్కడి పాలిటిక్స్‌లో మెలో డ్రామా ఎక్కువగా ఉంటుంది.. పైగా సినిమా, రాజకీయాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి.. ఏడు దశాబ్దాలుగా రాజకీయాలు ప్లస్ సినీరంగం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయి. రేపు జరగరబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తారలు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయి.. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలు తన వల్ల కాదని తప్పుకున్నారు కానీ ఉలగనాయకన్ కమల్‌హాసన్ మాత్రం రాజకీయాలలో తన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోవాలనే డిసైడయ్యారు. ఒంటరిగా వెళ్లే శక్తి లేక కూటములు కట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే అన్నాడీఏంకే, డీఎంకే కూటములు ఉన్నాయి కాబట్టి కమల్‌హాసన్ మూడో కూటమి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.. చాన్నాళ్లుగా తమిళనాడు ఎన్నికల్లో అన్నా డీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే పోటీ జరుగుతూ వస్తోంది.. ఇప్పుడేదో మూడో కూటమి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎన్నికల గోదాలో సోది లేకుండా పోతుందో, పరువు నిలుపుకుంటుందో చూడాలి. కూటములన్నాక అసంతృప్తులు ఉండటం సహజం. సీట్ల పంపకాలు ఆశించిన రీతిలో జరగకపోతే ఏ పార్టీకైనా అసంతృప్తి వస్తుంది.. ఇలాంటి పార్టీలన్నీ ఇప్పుడు మూడో కూటమి వంక చూస్తున్నాయి.
తమిళనాడులో బలంగా ఉన్న రెండు ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకే పొత్తులతో బిజీగా ఉన్నాయి. అధికార అన్నాడీఎంకే ఆల్‌రెడీ బీజేపీ, పీఎంకే, డీఎండీకేలతో పొత్తు కుదుర్చుకుంది. ఈ కూటమిలో మరో రెండు చిన్నపార్టీలు కూడా ఉన్నాయి. పెద్ద పార్టీలు చిన్నపార్టీలను ఎందుకు దరి చేర్చుకుంటాయంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కాబట్టి.. తమిళనాడులో ని చిన్నాచితక పార్టీలకు ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉంటుంది.. అందులో చాలా మట్టుకు కుల పార్టీలే కావడం గమనార్హం. ఇక అధికారం కోసం పరుగులు పెడుతున్న డీఎంకే కూటమిలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు , వీసీకే పార్టీ ఉంది. ఇప్పుడు మూడో కూటమి తయారవుతోంది. మొన్నటి వరకు డీఎంకే కూటమిలో ఉన్న ఇండియా జననాయక కట్చి అందులోంచి బయటకొచ్చేసింది.. ఇప్పుడు ఆ పార్టీనే మూడో కూటమి కోసం తహతహలాడిపోతున్నది. ఇక అన్నాడీఎంకే కూటమిలో ఉన్న సమత్తువ మక్కల కట్చికి కూడా మూడో కూటమి ప్రయత్నాల్లో పడింది.. అందుకు కారణం సీట్ల కేటాయింపులో పార్టీ అభిప్రాయాలు తీసుకోకపోవడమే! అసలు ఆ పార్టీ అధినేత శరత్‌కుమార్‌కు కనీసం ఆహ్వానం కూడా పంపలేదట! దీంతో పదేళ్లుగా అన్నాడీఎంకేతో కలిసి ఉన్న శరత్‌కుమార్‌కు అలకతో కూడిన కోపం వచ్చేసింది. వెంటనే అందులోంచి బయటకు వచ్చేశారు. శరత్‌కుమార్ మొన్నామధ్య శశికళతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కమల్‌హాసన్‌తో భేటి అయ్యారు. కమల్‌హాసన్ కూడా మూడో కూటమి అధికారంలోకి వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. కూటమికి మక్కల్ నీది మయ్యం నేతృత్వం వహించాలన్నది కమల్ కోరిక. పాపం డీఎంకే నుంచి పిలుపు వస్తుందని చాన్నాళ్లపాటు ఎదురుచూశారు కమల్. అక్కడ్నుంచి ఏ రకమైన సంకేతాలు రాకపోవడంతో మూడో కూటమిపై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఇండియా జననాయక కట్చి కూటమిలో చేరేందుకు ఉత్సాహపడుతున్నారు. మూడో కూటమి గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని కూడా కమల్ చెప్పుకొచ్చారు. కమల్‌హాసన్ అలా చెప్పారో లేదో వెంటనే ప్రతిస్పందనలు మొదలయ్యాయి. మూడో కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదని, ఎన్నికల్లో విజయం సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని శరత్‌కుమార్ స్పష్టం చేశారు.
జైలు నుంచి పెద్ద ఊరేగింపుగా, అట్టహాసంగా, ఆర్భాటంగా తమిళనాడులో అడుగుపెట్టిన శశికళ తనను కలుసుకునేందుకు నేతలు బారులు తీరతారని భావించారు. ఎంతో కొంత అసంతృప్తితో ఉన్న ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వమైనా తనతో చేతులు కలుపుతారని అనుకున్నారు. అధికార అన్నాడీఎంకే మాత్రం శశికళను లైట్ తీసుకుంది. ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా పీఎంకే తమ నుంచి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆ పార్టీకి చెందిన ప్రధాన సామాజికవర్గం పన్నియర్లకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పాస్ చేయించింది. ఓ రకంగా పీఎంకే అనుకున్నది సాధించిందనే చెప్పుకోవాలి. ఒకవేళ అన్నాడీఎంకే కనుక రిజర్వేషన్లు కల్పించకుంటే మాత్రం పీఎంకే అందులోంచి బయటకు వచ్చేసేది. డీఎంకేతో జత కట్టేది.. అది కాకపోతే మూడో కూటమిలోకి వెళ్లేది.. రిజర్వేషన్ల డిమాండ్‌ను సాధించుకున్నట్టే సీట్ల పంపకంలో కూడా తన పంతం నెరవేర్చుకుంది పీఎంకే. ఎస్.రాందాస్ నేతృత్వంలోని పీఎంకే పార్టీ పీఎంకే 23 సీట్లలో పోటీ చేయనుంది. మరోవైపు బీజేపీ తమకు 60 సీట్లు కావాల్సిందేనని పట్టుబడుతోంది. అన్నాడీఎంకే మాత్రం 20 సీట్లు ఇస్తామని, మరీ బెట్టు చేస్తే ఓ పాతిక సీట్లు ఇస్తామని, వాటితో సర్దుకుపోవాలని అంటోంది..
శశికళను బీజేపీ పట్టించుకోవడం లేదు కానీ ఆమె పది జయలలిలత పెట్టు అని అంటున్నారు వీఎమ్‌ఎస్ ముస్తఫా. తమిళనాడు ముస్లిం లీగ్ చీఫ్ అలయిన ముస్తఫా ఇప్పుడు శశికళ వెంట నడుస్తున్నారు. రేపొద్దున డీఎంకే అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఫాయిదానేనని, వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావచ్చని కమలం నేతలు ఆశపడుతున్నారని, కాకపోతే అది జరిగే పని కాదని ముస్తఫా అంటున్నారు. శశికళ ఉన్నంత వరకు బీజేపీ పప్పులు ఉడకవడని గట్టిగా చెబుతున్నారు. మూడో ఫ్రంట్‌కు శశికళనే సారథ్యం వహిస్తారని, విజయం సాధించడం ఖాయమని అంటున్నారు. ఇక నాగర్‌కోయిల్ మాజీ ఎమ్మెల్యే నంజిల్ మురుగేశన్ కూడా శశికళ పార్టీలో చేరిపోయారు. అన్నాడీఎంకేలో ఉన్న ఈయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కారణంగా సస్పెండ్ అయ్యారు. తమిళనాడు కొంగు ఇలైంగర్ పెరవాయ్ పార్టీ అధినేత, కంగయమ్ ఎమ్మెల్యే యు.తనియరసు మొన్నామధ్య శశికళను కలుసుకున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే కూటమిలో ఉన్న ఆయన ఇంకా అన్నాడీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీలు కలిసిపోతాయన్న నమ్మకంతో ఉన్నారు. ఎన్నికల ముందే రెండు పార్టీలు ఏకమవుతాయని అంటున్నారు. శశికళ కూడా అదే నమ్మకంతో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు అన్నాడీఎంకే ప్రభుత్వంపై పల్లెత్తు మాట కూడా అనలేదామె! ఎన్నికల ముందు రెండు పార్టీలు ఏకమయ్యే అవకాశం లేకపోయినా ఫలితాల తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి.. ఒకవేళ అన్నా డీఎంకే గెలిస్తే అది శశికళకు దెబ్బే! అప్పుడు శశికళను ఎవరూ పట్టించుకోరు. అన్నాడీఎంకే ఓడిపోతే మాత్రం శశికళతో దోస్తీ కట్టే ఛాన్సుంది. ఇదిలా ఉంటే తమిళనాడులోని మొత్తం 234 స్థానాలలో తాము పోటీ చేయబోతున్నట్టు బహుజన సమాజ్ పార్టీ ప్రకటించింది. అయితే ఏదైనా కూటమి నుంచి ఆహ్వానం వస్తే మాత్రం మనసు మార్చుకునే అవకాశం ఉంది. ఇద్దరు దిగ్గజాలు కరుణానిధి, జయలలితలు లేకుండా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉండబోతున్నదో చూడాలి..
Read More :
High Tension Video :తిరుపతి ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు వాగ్వాదం..ఎయిర్ పోర్ట్ వద్ద ఉద్రిక్త వాతావరణం.