తమిళనాడు: తలకు గాయమై ఓ వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. డాక్టర్లు వైద్యం చేసి కట్టుకట్టి ఇంటికి పంపారు. ఐతే గాయం నుంచి ఎంతకూ రక్తస్రావం ఆగకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు స్కాన్ చేయగా అసలు విషయం బయటపడింది. తలపై కుట్లు వేసిన ప్రదేశంలో ఇనుప నట్టు ఉండటం చూసి వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. అసలేం జరిగిందంటే..
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా వానియాంబాడీ ప్రాంతంలోని ఉదయేంద్రం గ్రామానికి చెందిన కార్తికేయన్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో కార్తికేయన్ నడుపుతున్నలారీని, వెనుక నుంచి ఓ ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. దీంతో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కార్తికేయన్ తలకు బలమైన గాయమైంది. స్థానికులు అతన్ని రక్షించి, వేలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాధితుడికి చికిత్స చేసి, తలకు కుట్లు వేశారు. అయినా రక్తస్రావం ఆగకపోవడంతో అతని కుటుంబ సభ్యులు కార్తికేయన్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు బాధితుడి తలకు కుట్లు వేసిన ప్రదేశంలో ఇనుప నట్టు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆపరేషన్ నిర్వహించి నట్టును తొలగించారు. గాయమైన ప్రదేశంలో ఇన్ఫెక్షన్కావడంతో.. రెండు రోజుల తర్వాత మళ్లీ కుట్లు వేస్తామని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంపై బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వేలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి డీన్ డాక్టర్పాపాపతిని వివరణ కోరగా, ఇప్పటివరకు తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మీడియాకు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.