కుండపోత వర్షాలతో తమిళనాడు అల్లాడిపోతోంది. రాకాసి వాన దెబ్బకు చెన్నైతోపాటు పలు జిల్లాలు విలవిల్లాడుతున్నాయ్. వరుణుడి విలయతాండవానికి గజగజ వణికిపోతున్నారు ప్రజలు. అయితే, కాపాడాల్సిన అధికార యంత్రాంగం.. ప్రజల ప్రాణాలు హరించే వ్యవహరిస్తున్నారు. జోరువానలో అత్యవసర చికిత్స కోసం వచ్చిన వృద్ధురాలి పట్ల కర్కశత్వం చూపించారు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది. రసీదు ఉంటేనే ఆస్పత్రి లోపలికి అనుమతిస్తామంటూ అత్యంత దారుణంగా ప్రవర్తించారు. తన తల్లిని లోపలికి అనుమతించాలని కొడుకు వేడుకున్నా ఆ కఠినాత్ముల గుండెలు కరగలేదు. కాళ్లూవేళ్లాపడి బతిమాలుకున్న డోంట్‌కేర్ అంటూ బయటికి గెంటేశారు ఆస్పత్రి సిబ్బంది. దాంతో, 72ఏళ్ల వృద్ధురాలు.. జోరువానలో తడుస్తూ.. చలికి గజగజ వణికిపోయింది. అత్యంత దారుణమైన హేయమైన ఈ ఘటన తిరువళ్లూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో జరిగింది.
అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన వృద్ధురాలికి సిటీ స్కాన్ రిఫర్ చేశారు డాక్టర్లు. దాంతో, డబ్బు కట్టి రసీదు తెచ్చేవరకూ లోపలికి అనుమతించాలని సిబ్బందిని వేడుకున్నాడు కొడుకు. కానీ, లోపలికి పంపేందుకు ససేమిరా అన్నారు హాస్పిటల్ సిబ్బంది. డబ్బు కట్టి రసీదు తీసుకొస్తేనే.. లోపలికి పంపుతామని తెగేసి చెప్పారు. దాంతో, సిటీ స్కాన్ కోసం డబ్బు కట్టేందుకు కొడుకు వెళ్తే.. అప్పటివరకూ జోరువానలో తడుస్తూ వణికిపోయింది వృద్ధురాలు. స్ట్రెచర్‌పై అలా వానతో తడుస్తూ వృద్ధురాలు ఇబ్బందిపడుతున్నా.. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించారు తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది. ఇప్పుడీ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన జనం.. మరీ ఇంత దారుణమా అంటూ మండిపడుతున్నారు. వృద్ధురాలి పట్ల కనికరం లేకుండా ప్రవర్తించిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, స్టాలిన్ సర్కార్ స్పందిస్తుందా?. ఆ కఠినాత్ములపై చర్యలు తీసుకుంటుందా?. ఏం జరగనుందో చూడాలి!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..