మిగ్‌జాం తుఫానుతో తల్లడిల్లిన తమిళనాడు. భారీ వర్షాలతో విలవిలలాడుతోంది. మిగ్‌జాం విపత్తు నుంచి కోలుకుంటుండగానే మరోసారి కుండపోత వాన కుమ్మరించింది. వానలు విరుచుకుపడి.. దాదాపు సగం రాష్ట్రానికి నరకం చూపిస్తున్నాయి. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తూత్తుకుడి జిల్లా కాయల్‌పట్టివనంలో అత్యధికంగా 94 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మదురై, విరుదునగరం, తేని జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్, మరో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ ఐంది. డ్యామ్‌లు నిండు కుండల్లా మారి నీటిని దిగువకు విడుదల చేయడంతో పరిస్థితి మరింతగా విషమించింది. తామర భరణి నది పొంగడంతో తిరునల్వేలి, తూత్తుకుడి నగరాలు జలదిగ్బంధనమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ జలమయం కాగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ఊళ్లకు ఊళ్లు నీళ్లలో చిక్కుకోవడంతో గూడు విడిచి.. కట్టుగుడ్డలతో సురక్షిత ప్రాంతాల్ని వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు జనం. కొందరిదైతే ఎక్కడికెళ్లాలో తెలియని అయోమయం. చంటి పిల్లల్ని తీసుకుని వాగులు దాటుతున్నారు ప్రజలు. అరవైఏళ్ల రికార్డుల్ని బద్దలు కొడుతూ నమోదవుతున్న వర్షపాతాలు… తమిళనాడుపై పగ బట్టేశాయి. మరీ ముఖ్యంగా దక్షిణ తమిళనాట పరిస్థితి దయనీయంగా మారింది. ఊరేదో, చెరువేదో తెలీనంత ఘోరంగా ఉంది. సైన్యాన్ని పంపాలంటూ ఢిల్లీకెళ్లి మోదీ దగ్గర మొరపెట్టుకున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా 17 రైళ్ళను రద్దు చేశారు. విమాన రాకపోకలకు సైతం అంతరాయం కలుగుతున్న పరిస్థితి తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
I request Honourable @rajnathsingh to urgently deploy more helicopters for rescue and relief in Tamil Nadu’s southern districts, severely affected by unprecedented rainfall. pic.twitter.com/aBTUgLTYQQ
— M.K.Stalin (@mkstalin) December 19, 2023
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు బెంబేలెత్తిపోతుంటే..మరోవైపు.. భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ప్రజలపై పిడుగులా పడింది..రాబోయే ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికను జారీ చేసింది. కన్యాకుమారి జిల్లాలో ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. మధ్య హిందూ మహాసముద్రం, దక్షిణ శ్రీలంక తీరానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉన్న తుఫాను గమనం ఇప్పుడు కొమోరిన్ ప్రాంతం సమీపంలో కేంద్రీృక్రితమై ఉందన్నారు. దీని ప్రభావంతో ఈ ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..