అతనో రాష్ట్ర పోలీస్ శాఖకు అధిపతి. కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు ఆదర్శవంతంగా ఉండాల్సిన బాధ్యతాయుతమైన వ్యక్తి. క్రిమినల్స్‌ని పట్టుకొని శిక్షంచాల్సిన కీలక స్థానంలో ఉన్న అతగాడు.. తన స్థాయిని మరిచి నీఛబుద్ధిని చాటుకున్నాడు. తాను అడిషనల్ డీజీపిని అని, ఎవరు ఏం చేస్తారులే అనుకున్నాడో ఏమో గానీ.. ఏకంగా ఓ ఐపీఎస్ ఆఫీసర్‌నే లైంగిక వేధింపులకు గురిచేశాడు. చివరకు ఆరోపణలు రుజువుకావడంతో మూడేళ్ళ జైలు శిక్ష విధించింది తమిళనాడులోని విల్లుపురం కోర్టు. తమిళనాడులో సంచలనం రేపిన తోటి ఐపీఎస్ అధికారిపై డీజీపీ లైంగిక వేధింపుల కేసులో ఎట్టకేలకు మాజీ ఏడీజీపీ రాజేశ్ దాస్‌కు మూడేళ్ళ కఠినకారాగార శిక్ష విధించింది కోర్టు. తమిళనాడు ప్రత్యేక డీజీపీ రాజేశ్ దాస్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 2021 ఫిబ్రవరిలో ఓ మహిళా ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న తనపై నాటి డీజీపీ రాజేశ్ దాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె కేసు పెట్టారు. తన కింది పోలీసు అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం రుజువవడంతో తమిళనాడులోని విల్లుపురం కోర్టు రాజేశ్ దాస్‌కి మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా కూడా విధించింది కోర్టు.
2021లో ఆనాటి ముఖ్యమంత్రి పళనిస్వామి సెక్యూరిటీ విధుల్లో భాగంగా, డీజీపీ రాజేశ్ దాస్ తో కలిసి ఉలుందూర్ పేటకు ఒకే వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో.. తనపై డీజీపీ రాజేశ్ దాస్ లైంగిక దాడికి ప్రయత్నించాడని మహిళా ఐపీఎస్ అధికారి ఆరోపించారు. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. వెంటనే రాజేశ్ దాస్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అంతేకాదు నాటి పళని స్వామి ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో విచారణ కమిటీని వేసింది. రెండేళ్ళ అనంతరం నాటి పోలీస్ బాస్‌ని కటకటాల వెనక్కి పంపింది కోర్టు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..