సిక్కోలు ముద్దుబిడ్డ.. ఆర్యసమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ ఇక ఒక చరిత్ర. దేశవ్యాప్తంగా జరిగిన అనేక సామాజిక ఉద్యమాలకు, పోరాటాలకు వెన్నుదన్నుగా నిలవడంతోపాటు.. భ్రూణహత్యలు, వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై, సామాజిక అంతరాలపై ఆయన ఎత్తిన గొంతు ఈ పుడమిపై ఎల్లకాలం వినిపిస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వారంరోజులుగా ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ బిలియరీ సైన్సెస్ లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిస్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖులు ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నారు. ఎప్పుడూ తలపై కాషాయ తలపాక ధరించే అగ్నివేశ్ 1939, సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. స్వామి అగ్నివేశ్ అసలు పేరు వేపా శ్యామ్ రావ్.. తల్లిదండ్రులు మరణించడంతో ఆయన తాతగారి స్వగ్రామం ఛత్తీస్‌గఢ్ వెళ్లిపోయి.. పలు డిగ్రీలు చేశారు. ఫిలాసఫీ, న్యాయవాద కోర్సులు చదివారు. ఆ తర్వాత ఆయన హర్యానా వెళ్లి ఆర్యసమాజ్‌లో చేరారు. అనంతరం స్వామి అగ్నివేశ్ సామాజిక సమస్యలపై పోరాడేందుకు ఆర్యసభ అనే రాజకీయ పార్టీను స్థాపించారు. దీంతోపాటు ఆయన హర్యానా నుంచి ఎమ్మెల్యేగా సైతం గెలిచి మంత్రిగానూ సేవలందించారు. మావోయిస్టులతో చర్చలకు సైతం మధ్యవర్తిత్వం వహించారు అగ్నివేశ్.