
ఖ్యాతి జైన్ అనే విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని మే 11, 2026న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన జరిగి 24 రోజులు గడిచినా ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో న్యాయ వ్యవస్థ ఇంత ఘోరంగా దిగజారిపోయిందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే.. మృతురాలు ఖ్యాతి జైన్ తల్లి వర్షా జైన్ తన కూతురి మరణంపై పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ కమిషనర్ వరకు పలుమార్లు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. అయినా ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఈ క్రమంలో తన కూతురి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు నిర్వహించి, మరణాన్ని హత్య కేసుగా నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కేసులో భాగంగా మృతురాలి తల్లి కూతురి ప్రియుడి గురించి కూడా పలు విషయాలు బయటపెట్టింది. ఖ్యాతి మరణానికి ముందు ఆమె ప్రియుడు తనీష్ దాదాపు మూడు గంటల పాటు ఇంట్లోనే ఉన్నాడని తల్లి ఆరోపిస్తున్నారు. అతనే తన కూతురి ప్రాణాలను తీసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తూ త్వరితగతిన దర్యాప్తు చేపట్టాలని కోరుతోంది.
తాను ఇంటర్వ్యూ పని మీద బయటకు వెళ్లిన సమయంలో ఖ్యాతి ప్రియుడు తనీష్ ఇంట్లోనే ఉన్నాడని, అనంతరం తన కూతురు మృతి చెందిన విషయాన్ని అతనే తనకు సమాచారం అందించాడని పోలీసుల విచారణలో వర్షా చెప్పారు. అంతేకాకుండా, ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత తనీష్ మళ్లీ ఇంటికి వచ్చి వీడియో చిత్రీకరించాడని, ఈ అంశంపై కూడా విచారణ జరపాలని ఆమె కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. “అమ్మా.. మీరు నా ప్రాణం తీసేశారు” అని రాసి ఉన్న సందేశం ఖ్యాతి పంపినట్లుగా చెబుతుండడంతో కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. పోలీసుల విచారణలో ఖ్యాతి ఇంట్లోకి తనీష్ ప్రవేశిస్తున్న సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
ఇదిలా ఉండగా.. పోలీసులు ప్రస్తుతం ఖ్యాతి కేసును ఆత్మహత్య కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని, ఖ్యాతి ప్రియుడు తనీష్‌ను కూడా విచారిస్తున్నామని తెలిపారు. సైబర్ ఫోరెన్సిక్ నివేదికతో పాటు బిస్రా పరీక్షా ఫలితాల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. ఖ్యాతి జైన్ మృతి చెంది 24 రోజులు గడిచినా ఇప్పటికీ దర్యాప్తు పూర్తి కాలేదని ఆమె తల్లి వర్షా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖ్యాతి జైన్ మృతి కేసులో ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోయారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని చెబుతున్నా, అసలు నిజాలు ఓ కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం తమ దగ్గరున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకైతే ఎవరిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, దర్యాప్తు నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.