ఈ సారి చుక్కలే.. మండిపోనున్న మార్చి.. వాతావరణశాఖ సంచలన రిపోర్ట్..

ఈ వేసవిలో భానుడు భగ్గుమననున్నాడు.. మార్చి నుండి మే నెల వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. వడగాలుల తీవ్రత కారణంగా ప్రజారోగ్యం, విద్యుత్ డిమాండ్ మరియు నీటి వనరులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

ఈ సారి చుక్కలే.. మండిపోనున్న మార్చి.. వాతావరణశాఖ సంచలన రిపోర్ట్..
India Heatwave Forecast

Updated on: Feb 28, 2026 | 7:38 PM

దేశంలో వేసవి ఎండలు ఈసారి ముందే మొదలుకానున్నాయి. మార్చి నుండి మే నెల మధ్య దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తీవ్రమైన వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వడగాలుల ప్రభావం ముఖ్యంగా పశ్చిమ రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌తో పాటు ఉత్తర కర్ణాటక, ఉత్తర తమిళనాడు ప్రాంతాలలో ఎక్కువగా ఉండనుంది. వడగాలుల వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదం ఉందని IMD DG మృత్యుంజయ్ మోహపాత్ర ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులు, పిల్లలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అలాగే నీటి ఎద్దడి, విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. మార్చిలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈశాన్య, వాయువ్య, తూర్పు మధ్య దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భూమధ్యరేఖ పసిఫిక్‌లో బలహీనమైన లా నినా పరిస్థితులు ఉన్నాయి. అయితే రాబోయే నెలల్లో తటస్థ ఎల్ నినో పరిస్థితులు తిరిగి రావచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఫిబ్రవరి నెల రికార్డులు

గత నెల వర్షపాతం 2001 తర్వాత అత్యల్పంగా నమోదైంది. అలాగే 1901 నుండి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఫిబ్రవరి నెలల్లో ఇది ఒకటిగా నిలిచింది. పాశ్చాత్య అవాంతరాలు చురుకుగా లేకపోవడం వల్లే ఈసారి ఫిబ్రవరిలో వర్షాలు, చలి గాలులు తగ్గాయని IMD వివరించింది.

Follow Us