IRCTC: రూ. 35 కోసం మూడు చెరువుల నీళ్లు తాగించాడు.. వ్యవస్థనే దిగొచ్చేలా చేశాడు..

IRCTC: 'నాది కానిది కోటి రూపాయలైనా నాకు వద్దు. నాది అర్థ రూపాయి అయినా వదిలి పెట్టను' సాహసం సినిమాలో హీరో గోపిచంద్‌ చెప్పే డైలాగ్‌. ఈ సినిమాలో హీరో పాత్ర స్వభావాన్ని ఈ ఒక్క డైలాగ్ చెబుతుంది. అయితే నిజ జీవితంలో...

IRCTC: రూ. 35 కోసం మూడు చెరువుల నీళ్లు తాగించాడు.. వ్యవస్థనే దిగొచ్చేలా చేశాడు..

Updated on: May 31, 2022 | 4:39 PM

IRCTC: ‘నాది కానిది కోటి రూపాయలైనా నాకు వద్దు. నాది అర్థ రూపాయి అయినా వదిలి పెట్టను’ సాహసం సినిమాలో హీరో గోపిచంద్‌ చెప్పే డైలాగ్‌. ఈ సినిమాలో హీరో పాత్ర స్వభావాన్ని ఈ ఒక్క డైలాగ్ చెబుతుంది. అయితే నిజ జీవితంలో ఇలా ఎవరైనా ఉంటారా.? తాము కష్టపడి సంపాదించుకున్న రూపాయినైనా వదలకుండా ఉంటారా.? అంటే తాజాగా జరిగిన ఓ సంఘటన నిజమే అని చెబుతోంది. రూ. 35 కోసం ఓ వ్యక్తి ఏకంగా వ్యవస్థతోనే పోరాడాడు. ఏకంగా 5 ఏళ్లు పోరాడి తన 35 రూపాయాలను తిరిగిపొందాడు. సినిమా కథను తలపిస్తోన్న ఈ సంఘటన రాజస్థాన్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని కోటకు చెందిన సుజీత్‌ స్వామి అనే వ్యక్తి 2017 జులై 2న గోల్డెన్‌ టెంపుల్‌ మెయిల్‌ ద్వారా ఢిల్లీ వెళ్లేందుకు రెండు నెలల ముందు రూ. 765తో రైలు టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. అయితే అనివార్య కారణాలతో సుజీత్‌ ఆ టికెట్‌ను క్యాన్సల్‌ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో రూ. 665 రిఫండ్‌ అయింది. అయితే నిబంధనల ప్రకారం టికెట్ క్యాన్సిల్‌ చేసుకుంటే రూ. 65 క్లరికల్‌ ఛార్జీలు మాత్రమే కట్‌ కావాల్సి ఉండగా, రైల్వే మాత్రం రూ. 35 సర్వీస్‌ టాక్స్‌తో మొత్తం రూ. 100 సుజీత్‌ నుంచి ఛార్జ్‌ చేసింది. నిజానికి సుజీత్‌ టికెట్ బుక్‌ చేసుకున్న సమయానికి దేశంలో జీఎస్‌టీ ఇంకా అమల్లోకి రాలేదు, కానీ ప్రయాణ తేదీ జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఉందన్న కారణంగా రైల్వే అధికారులు రూ. 35 సర్వీస్‌ ఛార్జ్‌ను వసూలు చేశారు.

దీంతో ఈ విషయం తెలుసుకున్న సుజీత్‌ లోక్‌ అదాలత్‌ను సంప్రదించాడు. ఏకంగా రెండేళ్లపాటు ఎన్నోసార్లు ఆర్‌టీఐ ద్వారా ఐఆర్‌సీటీసీకి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన ఐఆర్‌టీసీ 2019 మే1న రూ. 33 రీఫండ్‌ చేసింది. అయితే సుజీత్‌ తనకు రావాల్సి రెండు రూపాయలను కూడా వదులుకోవాలనుకోలేదు. ఆ రెండు రూపాయాల కోసం మళ్లీ మూడేళ్లు పోరాటం చేశాడు. చివరిగా పోరాటం ఫలించి ఐఆర్‌టీసీ ఆ రెండు రూపాయలను కూడా సుజీత్‌ ఖాతాలో జమ చేసింది.

ఇదిలా ఉంటే సుజీత్‌ లాగే దాదాపు రెండున్నర లక్షల మంది దగ్గర నుంచి కూడా ఐఆర్‌టీసీ జీఎస్‌టీ అమలు సమయంలో సర్వీస్‌ టాక్స్‌ వసూలు చేసిందట. సుజీత్‌ పోరాట ఫలితంగా 2.98 లక్షల మందికి రూ. 2.43 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఇక చివర్లో అదిరిపోయే ట్విస్ట్‌ ఏంటంటే ఇంత పోరాటం చేసిన సుజీత్‌ తాను విజయం సాధించిన ఆనందంలో పీఎం కేర్స్‌కు రూ. 535 విరాళం ఇవ్వడం విశేషం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..