మీరట్, ఏప్రిల్ 25: పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయని సంతోషాన్ని పట్టలేకపోయాడో విద్యార్ధి. అంతే.. వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ మాధ్యమిక శిక్షా పరిషత్ (UPMSP) UP బోర్డ్ 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ 20న విడుదలైన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పోస్టాఫీసులో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్న సునిల్ కుమార్ కుమారుడు అన్షుల్ కుమార్ (16). మహర్షి దయానంద విద్యాసంస్థలో పదో తరగతి చదివిన పరీక్షలు రాసి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూశాడు.
ఈ క్రమంలో శనివారం విడుదలైన బోర్డు ఫలితల్లో తన రిజల్ట్స్ చెక్ చేసుకున్నాడు. ఫలితాల్లో 93.5 శాతం మార్కులు సాధించాడు. దీంతో అన్షుల్‌తోపాటు కుంటుంబ సభ్యులు కూడా ఎగిరి గంతేశారు. కానీ వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే, విద్యార్థి స్పృహతప్పి పడిపోయాడు. దీంతో షాకుకు గురైన అతడి కుటుంబసభ్యులు విద్యార్ధి అన్షుల్‌ను తీసుకుని పరుగు పరుగున దవాఖానకు చేరుకున్నారు. ప్రస్తుతం ఐసీయూలో అన్షుల్ చికిత్స పొందుతున్నాడు. ఐసీయూలో చేర్చిన తర్వాత విద్యార్థి అన్షూల్ ఆరోగ్యం నిలకడగా ఉందని అన్షుల్ బంధువు పుష్పేంద్ర మీడియాకు తెలిపాడు.
కాగా ఉత్తరప్రదేశ్ మాధ్యమిక శిక్షా పరిషత్ (UPMSP) ఇటీవలే యూపీ బోర్డు 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 89.55 శాతంగా నమోదైంది. గత ఏడాది కంటే కాస్త తక్కువ శాతం ఉత్తీర్ణత నమోదైంది. యూపీ ఫలితాల్లో మహ్మదాబాద్‌లోని సీతా బాల విద్యా మందిర్ ఇంటర్ కాలేజీకి చెందిన ప్రాచీ నిగమ్ హైస్కూల్ పరీక్షల్లో 98.50% (600 మార్కులకు 591) మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. ఐఐటీ-జేఈఈలో ర్యాంకు కొట్టి ఇంజనీర్ కావాలనేదే తన లక్ష్యం అని చెప్పింది. గణితం, సైన్స్, డ్రాయింగ్ ఈ మూడు సబ్జెక్టుల్లో ప్రాచీ నిగమ్ వందకు వంద మార్కులు సాధించింది. ఇంగ్లీష్, హిందీ, సోషల్ స్టడీస్‌లో 97 మార్కుల చొప్పున సాధించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.