Parliament Special Session: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు జరగనున్నాయి. మొదటిరోజు పాత పార్లమెంట్ భవనంలో.. రెండో రోజు నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 75 ఏళ్ల ప్రస్థానంతోపాటు, సాధించిన విజయాలు, అనుభవాలపై తొలి రోజు చర్చ జరగనుంది. ఆ తర్వాత జమిలి (వన్ నేషన్ వన్ ఎలక్షన్) ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ బిల్లు సహా పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభ, లోక్‌సభలో రెండేసి బిల్లుపై చర్చ జరగనున్నట్లు సమాచారం.. రాజ్యసభలో కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, అలాగే లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనుంది. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం పలు కీలక బిల్లులను కూడా తెరపైకి తీసుకువచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. మొత్తం మోడీ ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కోసం ఓ వైపు విపక్ష పార్టీలు అస్త్రాలు సిద్దం చేసుకుంటుండగా.. మరోవైపు ధీటైన సమాధానం చెప్పేందుకు అధికారంలోని ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రతిపక్షాలు నిరుద్యోగం.. ద్రవ్యోల్బణంపై విపక్షాల పట్టు పట్టే అవకాశముంది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టి, వాటికి ఆమోదం తెలపాలని BJD, BRS పట్టుబడుతున్నాయి. మరోవైపు సభలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
అఖిలపక్ష సమావేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, సామాజిక ఘర్షణలతోపాటు మణిపుర్‌లో పరిస్థితి వంటి అంశాలను లేవనెత్తుతామన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంలో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఇక ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే, తొలిరోజు పాత పార్లమెంట్ భవనంలోనే సమావేశాలు కొనసాగనున్నాయి. రెండో రోజు నుంచి కొత్త భవనంలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9:30కు కొత్త భవనం ఎదుట ఫొటో సెషన్ జరగనుంది. వినాయక చవితి పూజల తర్వాత కొత్త పార్లమెంట్ లో సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..