ముంబై, మే 31: మాతృత్వం ఏ తల్లికైనా అద్భుతమే. పురిటి బిడ్డ నుంచి రెక్కలొచ్చేంత వరకూ దాసిలా ఆ బిడ్డకు సేవలు చేస్తుంది. మలమూత్రాలను ఛీదరించుకోకుండా శుభ్రం చేస్తుండి. కడుపు నిండా భోజనం పెట్టి బిడ్డ ఆకలిని తీరుస్తుంది. బిడ్డ ప్రతి అవసరాన్ని నోరువిప్పి చెప్పక ముందే గ్రహించి అన్నీతానై చేసి మురిసిపోతుంది. అంతటి త్యాగమూర్తి అనారోగ్యంతో పదేపదే బాత్రూంకి వెళ్తే ఆ కొడుకుకు అసహ్యం కలిగింది. అంతే తల్లి తల నరికి బావిలో పడేశాడు. తండ్రికి ఇంటికొచ్చే సరికి ఆ కొడుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. కడుపు రగిలిపోయిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడమేకాదు.. పదేళ్లపాటు పోరాడి ఆ కసాయి కొడుకుకి శిక్ష పడేంత వరకూ శాంతించలేదు. తీరా కోర్డు కొడుకుకి శిక్ష విధించిన తర్వాత గుండెలవిసేలా రోధించాడు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
2014 నాటి కేసు ఇది. జైసింగ్‌పూర్ కొత్వాలిలో నివాసం ఉంటున్న సుకై విష్ణకర్మ అనే వ్యక్తి తన భార్య రాంలాలీకి కడుపునొప్పి రావడంతో.. ఆమెకు మందులు తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని దృశ్యం చూసి షాక్‌కు గురయ్యాడు. ఇంట్లోకి ప్రవేశించిన విష్ణకర్మ తన కొడుకు మహేంద్ర రక్తంతో తడిసి ఉండటాన్ని చూసి హడలెత్తిపోయాడు. ఏం జరిగిందని ప్రశ్నించగా.. తల్లి తల నరికి బావిలో పడేసినట్లు కొడుకు చెప్పాడు. కడుపు నొప్పి కారణంగా తల్లి పదే పదే మల విసర్జన చేయడం కొడుకు మహేంద్రకు అసహ్యం కలిగించింది. దీంతో ఆ కొడుకు తల్లి గొంతు కోసి హత్య చేశాడు. ఇది విన్న ఆ తండ్రికి కోపం కట్టలు తెంచుకుని వచ్చింది. ఇలాంటి కసాయి కొడుక్కి కఠిన శిక్ష విధించాలని అనుకున్నాడు. అంతే కోపానికి తమాయించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కొడుకు మీద ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నాటి నుంచి దాదాపు పదేళ్ల పాటు ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. తమ కడుపున పుట్టిన కసాయి కొడుక్కి శిక్ష పడేంత వరకు ఆ తండ్రి పోరాడాడు. చివరకు ఈ కేసును గురువారం విచారించిన కోర్టు మొత్తం ఏడుగురు సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకుని అంతిమ తీర్పును వెలువరించింది. విచారణ సమయంలో నిందితుడి తండ్రి విష్ణకర్మ భార్యను కోల్పోయిన బాధను వ్యక్తం చేశాడు. అలాగే తన కొడుకును పిచ్చివాడిగా అభివర్ణించాడు. లేదంటే ఏ కొడుకూ తన చేతులతో ఈ పని చేయడని ఆవేదన వ్యక్తం చేశాడు. విచారణ తర్వాత కోర్టు మహేంద్రను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పు విన్న తండ్రి కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఇలాంటి పరిస్థితి ఏ భర్తకు, ఏ తండ్రికి రాకూడదంటూ గుండెలవిసేలా రోధించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.