Heart Attack: వరుస గుండెపోటు మరణాలపై షాకింగ్‌ రిపోర్ట్‌… హై రిస్క్‌ జోన్‌లో ఆటో, క్యాబ్ డ్రైవర్లు

కర్నాటకలోని హసన్ జిల్లాలో వరుస గుండెపోటు మరణాలపై రవీంద్రనాథ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది మే-జూన్ మధ్య కర్నాటక హసన్ జిల్లాలో వరసబెట్టి ఆకస్మిక మరణాలు నమోదయ్యాయి. జనాన్నే కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా భయపెట్టేశాయి. గతంలో వేసుకున్న కరోనా టీకాలే...

Heart Attack: వరుస గుండెపోటు మరణాలపై షాకింగ్‌ రిపోర్ట్‌... హై రిస్క్‌ జోన్‌లో ఆటో, క్యాబ్ డ్రైవర్లు
Gas Pain Vs Heart Attack

Updated on: Jul 12, 2025 | 7:28 AM

కర్నాటకలోని హసన్ జిల్లాలో వరుస గుండెపోటు మరణాలపై రవీంద్రనాథ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది మే-జూన్ మధ్య కర్నాటక హసన్ జిల్లాలో వరసబెట్టి ఆకస్మిక మరణాలు నమోదయ్యాయి. జనాన్నే కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా భయపెట్టేశాయి. గతంలో వేసుకున్న కరోనా టీకాలే ఆకస్మిక మరణాలకు కారణమని కూడా ప్రచారం జరిగింది. కానీ.. యువత ఆకస్మిక మరణాలతో కొవిడ్‌ వ్యాక్సిన్లకు సంబంధం లేదని ఐసీఎంఆర్‌, ఎయిమ్స్‌ తేల్చేసింది.

ఇప్పుడు లోతుగా అధ్యయనం జరిగాక.. మరిన్ని విస్తుబోయే అంశాలు బైటికొచ్చాయి. డాక్టర్ కేఎస్ రవీంద్రనాథ్ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్‌… దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేవలం 40 రోజుల్లో 24 మరణాలు సంభవిస్తే, వీరిలో ఎక్కువమంది 45లోపు వాళ్లేనట. వయసు ముప్పైనలభై ఐనా నిండకముందే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఆటోడ్రైవర్లే ఇక్కడ బాధితులట. హసన్ జిల్లా హార్ట్‌ఎటాక్స్ రిపోర్ట్‌తో.. డ్రైవింగ్ సంబంధిత దుష్‌ప్రభావాలపై ఒక్కసారిగా ఫోకస్ పెరిగింది. మృతుల్లో 30 శాతం మంది ఆటో-క్యాబ్‌ డ్రైవర్లే. హసన్ జిల్లా నుంచి బెంగళూరు వెళ్లి పొట్టకూటి కోసం ఆటోలు, క్యాబ్‌లు నడుపుకుంటున్నవాళ్లే. వాళ్ల లైఫ్ స్టయిల్, వృత్తిపరమైన ఒత్తిళ్లు గుండెపోటుకు దారితీశాయి.. అని రవీంద్రనాథ్ రిపోర్ట్‌లో స్పష్టంగా రాసుంది.

ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం, క్రమబద్ధంగా ఆహారం తీసుకోకపోవడం, శారీరక వ్యాయామం చేయకపోవడం, స్మోకింగ్, పని ఒత్తిడి, నిద్రలేమి, వాతావరణ కాలుష్యం.. ఇవన్నీ డ్రైవింగ్ ప్రొఫెషన్‌లో ఉండేవాళ్లను వేధించే శాపాలు. ఇవే గుండెపోటుకు దారితీసి ప్రాణాంతకంగా మారుతున్నాయి. హసన్‌ జిల్లాలో నమోదైన మిగతా చావులు కూడా మొబిలిటీ వర్కర్స్‌వే. అంటే.. స్విగ్గీ, జొమాటో, ఓలా, ర్యాపిడో లాంటి సర్వీసుల్లో ఉండేవాళ్లు రోజులో ఎక్కువ సమయం డ్రైవింగ్‌లో ఉంటారు. పైసల కోసం ఓవర్‌డ్యూటీలు కూడా చేస్తారు. వీళ్లంతా ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని హసన్ హార్ట్‌ఎటాక్స్‌కి సంబంధించిన డెత్ రిపోర్ట్ హెచ్చరిస్తోంది.

ఆటో-క్యాబ్ డ్రైవర్లకు కనీసం ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వమే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించాలంటూ సిఫార్సులొస్తున్నాయి. ఆ విషయాన్ని కూడా పరిశీలిస్తోంది కర్నాటక ఆరోగ్యమంత్రిత్వశాఖ. సో… గుండెపోటు మరణాలకు సాఫ్ట్‌ టార్గెట్లు డ్రైవర్లేనా? దేశవ్యాప్తంగా డ్రైవింగ్ వృత్తిలో ఉండేవాళ్లందరూ అప్రమత్తం కావాల్సిందేనా? అంటే అధ్యయనాలు మాత్రం అవుననే అంటున్నాయి.