షిర్డీ సాయిబాబా ఆలయానికి భారీగా విరాళాలు.. ఒక్క ఏడాదిలో వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా!?

Shirdi Sai Baba Temple: షిర్డీ శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌కు 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.660 కోట్ల విరాళాలు అందాయి. సంస్థాన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.3,618 కోట్లకు చేరగా, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ రూపంలోనూ భారీగా కానుకలు లభించాయి. భక్తుల విరాళాలను ఆసుపత్రులు, విద్య, అన్నదానం, యాత్రికుల సేవల కోసం వినియోగిస్తున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది.

షిర్డీ సాయిబాబా ఆలయానికి భారీగా విరాళాలు.. ఒక్క ఏడాదిలో వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా!?
Shirdi Sai Baba Donations

Updated on: Jul 09, 2026 | 12:21 PM

మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో ఉన్న శ్రీ సాయిబాబా సమాధి ఆలయాన్ని నిర్వహిస్తున్న శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (SSST)కు భక్తుల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నగదు, డిజిటల్ చెల్లింపులు, విదేశీ కరెన్సీ, బంగారం, వెండి, వైద్య పరికరాల రూపంలో అందిన విరాళాల విలువ సుమారు రూ.660 కోట్లకు చేరిందని సంస్థాన్ సీఈఓ గోరక్ష్ గడిల్కర్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం సంస్థాన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మొత్తం విలువ రూ.3,618 కోట్లకు చేరుకోగా, వాటిపై వడ్డీ రూపంలోనే ఏటా రూ.256 కోట్ల ఆదాయం లభిస్తోంది. భక్తుల నుంచి అందుతున్న విరాళాలను వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడిగా ఉంచడం వల్ల సంస్థకు స్థిరమైన ఆదాయం సమకూరుతోందని తెలిపారు.

గత ఏడాది కాలంలోనే 3 కోట్లకు పైగా భక్తులు షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ విరాళాలు గణనీయంగా పెరగడం వల్ల సంస్థాన్ ఆర్థిక బలం మరింత పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. భక్తులు కేవలం నగదు మాత్రమే కాకుండా సేవాభావంతో ఆసుపత్రులకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలను కూడా విరాళంగా అందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే రూ.15 నుంచి రూ.20 కోట్ల విలువైన వైద్య పరికరాలు సంస్థాన్ ఆసుపత్రులకు అందినట్లు గడిల్కర్ తెలిపారు.

విదేశాల్లో నివసిస్తున్న సాయిభక్తులు రూ.4.89 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని విరాళంగా సమర్పించగా, దర్శనం, హారతి టికెట్ల ద్వారా మరో రూ.39.55 కోట్ల ఆదాయం సమకూరింది.

ఇవి కూడా చదవండి

బంగారం, వెండి రూపంలోనూ భక్తుల కానుకలు భారీగానే కొనసాగుతున్నాయి. 2026 జూన్ 15 నాటికి సంస్థాన్ వద్ద రూ.151.87 కోట్ల విలువైన 549.44 కిలోల బంగారం, రూ.25.33 కోట్ల విలువైన 7,030.47 కిలోల వెండి నిల్వ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే భక్తులు మరో 16 కిలోల బంగారం, 197 కిలోల వెండిని సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.

సంస్థాన్ ఆదాయం కూడా ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. 2021-22లో రూ.436.95 కోట్లు నమోదవగా, 2022-23లో రూ.803.93 కోట్లు, 2023-24లో రూ.819.57 కోట్లు, 2024-25లో రూ.850.97 కోట్లు, 2025-26లో రూ.851.97 కోట్లకు చేరింది.

“లక్షలాది మంది సాయిబాబా భక్తుల విశ్వాసంతో నడుస్తున్న ఈ సంస్థాన్ వార్షిక టర్నోవర్ రూ.850 కోట్లను దాటింది. భక్తుల నుంచి అందుతున్న విరాళాలను రోగుల వైద్య సేవలు, విద్య, యాత్రికుల వసతి, అన్నదాన కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తున్నాం. సేవాభావం, మానవత్వం అనే సాయిబాబా సందేశాన్ని అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నాం” అని ఆలయ సీఈఓ గోరక్ష్ గడిల్కర్ తెలిపారు.

Follow Us