Seven dead – Oxygen Shortage: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్రలో ఆసుపత్రుల్లో సౌకర్యాల కొరత వేధిస్తోంది. క్రమంగా రోగుల సంఖ్య పెరుగుతుంటే.. ఓ వైపు ఆక్సిజన్ సిలిండర్ల కొరత.. మరోవైపు బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆక్సిజన్ సిలిండర్లను పంపాలని కేంద్రాన్ని కోరింది. ఆక్సిజన్ లేకనే చాలాచోట్ల రోగులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో మరో దారుణం చోటు చేసుకుంది. ఆక్సిజన్ కొరత వల్ల ఆసుపత్రిలో ఏడుగురు రోగులు మరణించారు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో జరిగింది.
ముంబై నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోని నాలాసోపరలోని వినాయక ఆసుపత్రిలో ఏడుగురు రోగులు ఆక్సిజన్ కొరతతో మరణించారని మృతుల బంధువులు పేర్కొన్నారు. తమ బంధువుల మృతికి ఆక్సిజన్ కొరత, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ వారు ఆందోళన నిర్వహించారు. తన తండ్రికి కరోనా నెగిటివ్ అని వచ్చినా మరణించారని ఆక్సిజన్ కొరత వల్లనే ఇలా జరిగిందంటూ.. మృతుడి కుమార్తె పేర్కొంది. సోదరుడిని ఆసుపత్రిలో చేర్చి ఇంజెక్షన్ కోసం రూ.35వేలు చెల్లించినా మరణించాడని మృతుడి సోదరి ఆరోపించింది.
ఈ క్రమంలో మృతులందరి కుటుంబీకులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. వినాయక ఆసుపత్రి ఎదుట తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు సమయానికి ఆందోళనకారులతో మాట్లాడారు. అయితే.. గతకొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ఆక్సిజన్ కొరత ఉందని మేయర్ రాజీవ్ పాటిల్ పేర్కొన్నారు. కాగా.. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 63వేల కరోనా కేసులు నమోదు కాగా,400 మంది మరణించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ.. నిత్యం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: