పవన్ హస్తిన యాత్ర వెనుక అసలు రహస్యం ఇదేనా? బిజెపి పెద్దల ముందు జనసేనాని కొత్త ప్రతిపాదన..

|

Nov 24, 2020 | 5:46 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఢిల్లీ యాత్ర ఎందుకు పెట్టారు? ఇది ఇప్పుడు తన పార్టీ వర్గాలనే కాదు .. తెలుగు రాష్ట్రాల రాజకీయాలని పరిశీలిస్తున్న ప్రతి ఒక్కరికీ కలుగుతున్న సందేహం ఇది.

పవన్ హస్తిన యాత్ర వెనుక అసలు రహస్యం ఇదేనా? బిజెపి పెద్దల ముందు జనసేనాని కొత్త ప్రతిపాదన..
Follow us on

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఢిల్లీ యాత్ర ఎందుకు పెట్టారు? ఇది ఇప్పుడు తన పార్టీ వర్గాలనే కాదు .. తెలుగు రాష్ట్రాల రాజకీయాలని పరిశీలిస్తున్న ప్రతి ఒక్కరికీ కలుగుతున్న సందేహం ఇది. ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గిన పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లడం వెనుక రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన జనసేన సారథి పవన్ కళ్యాణ్ .. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి సన్నిహితంగా మారిన సంగతి తెలిసిందే. బిజెపి, జనసేన పార్టీల మధ్య పొత్తు చిగురించి చాలా కాలం గడిచింది. ఇప్పటివరకు కలిసి కార్యక్రమాలు నిర్వహించింది లేదు.. కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

అయితే గ్రేటర్ ఎన్నికల్లో దూకుడు మీద కనిపిస్తున్న బిజెపి.. జనసేన పార్టీతో జత కడితే తమపై ఆంధ్ర ముద్ర పడుతుంది అన్న భయంతో పవన్ కళ్యాణ్ ను ఒప్పించి మరీ గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా నిలువరించ గలిగారు. ఈ క్రమంలో గత నాలుగైదు రోజులుగా సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రి అకస్మాత్తుగా ఢిల్లీకి పయనమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన దుర్గాప్రసాద్ కరోనా వైరస్ సోకి మరణించిన నేపథ్యంలో అక్కడ త్వరలో ఉప ఎన్నిక జరిగే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని ఉప ఎన్నికల బరిలో ముందుగా నిర్ణయించింది. ఆ తర్వాత అధికార వైసీపీ కూడా గురుమూర్తిని తిరుపతి ఉప ఎన్నిక బరిలోకి దింపాలని తీర్మానించింది. అయితే గతంలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బిజెపి ఓ మోస్తరు ఓట్లను సాధించిన నేపథ్యంలో అక్కడ బిజెపి బరిలోకి దిగుతుందా ? లేక మిత్ర పక్షమైన జనసేనకు ఆ సీటు కేటాయిస్తుందా అన్నది చర్చనీయాంశం అయింది.

ఈ క్రమంలోనే జనసేనాని హస్తిన బాట పట్టడంతో రకరకాల కథనాలు మొదలయ్యాయి. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం జనసేనకివ్వాలని కోరేందుకే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్ళారని చెప్పుకుంటున్నారు. బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిని తిరుపతి బరిలో దింపితే బావుంటుందని బీజేపీ అధిష్టానానికి తెలిపేందుకు ఢిల్లీకి వెళ్ళినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బిజెపి నేతల కోరిక మేరకు జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న నేపథ్యంలో దానికి పరిహారంగా (రిటర్న్ గిఫ్ట్‌గా) తిరుపతి లోక్‌సభ స్థానాన్ని అడిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మరి కమలనాథుల అభిమతం ఎలా ఉందో వేచి చూడాల్సిందే.