ఉత్తర భారతదేశంలో గాలి నాణ్యత క్షీణించడం వలన పాఠశాలలు మూసివేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలో తక్షణ చర్యలను అమలు చేశాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రభావిత రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) స్థాయిలు, విద్యార్థుల భద్రతపై చర్యలు చేపడుతున్నారు అధికారులు.
ఉత్తర భారతదేశంలో తీవ్రమైన ఎయిర్ పోల్యూషన్:
ఢిల్లీ గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఆనంద్ విహార్ (487), చాందినీ చౌక్ (444), ద్వారక (499) వంటి అనేక ప్రాంతాల్లో AQI రీడింగ్‌లు 450-500ను అధిగమించాయి. ఈ తీవ్రమైన ఎయిర్‌పోల్యూషన్ స్థాయిలు ప్రమాదకరంగా మారాయి. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలున్నవారు ప్రమాదంలో ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వం GRAP IV (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్)ను అమలు చేసింది. వాహనాల రాకపోకలు, నిర్మాణ కార్యకలాపాలపై పరిమితులతో సహా కఠినమైన నియంత్రణలను చేపడుతోంది.
హర్యానా AQI కూడా భారీగా ఉంది. దాదాపు 320 రీడింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరింది. పంజాబ్‌లో AQI, 207 వద్ద నమోదైంది. ఢిల్లీ, హర్యానా కంటే తక్కువ తీవ్రత ఉన్నప్పటికీ, రాష్ట్రం చర్యలు చేపడుతోంది. ఢిల్లీ-NCR ప్రాంతంలో భాగమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, నోయిడా వంటి నగరాలు కూడా తీవ్రమైన AQI స్థాయిలలో ఉన్నాయి. దాదాపు 352-408 రీడింగ్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పాఠశాలల మూసివేత గురించి ప్రకటించనప్పటికీ, మూసివేసే దిశగా ఆలోచనలు చేస్తోంది.
పాఠశాలలకు సెలవులు:
తీవ్రమైన గాలి నాణ్యత స్థాయిల దృష్ట్యా ఉత్తర ప్రాంతంలోని జిల్లా, రాష్ట్ర పరిపాలన పాఠశాలలను మూసివేసి ఆన్‌లైన్ తరగతులకు మార్చినట్లు ప్రకటించాయి. భయంకరమైన AQI స్థాయి నమోదు కావడంతో ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలను మూసివేసి ఆన్‌లైన్ తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న 10, 12 తరగతుల విద్యార్థులు ఆఫ్‌లైన్ తరగతులను కొనసాగించడానికి అనుమతించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆన్‌లైన్ తరగతులు అవసరమని పేర్కొంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి X (గతంలో ట్విట్టర్)లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
హర్యానా ప్రాథమిక పాఠశాలలకు సెలవులు!
హర్యానా ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. డెరైక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్థానిక గాలి నాణ్యత పరిస్థితులను బట్టి సెలవును పొడిగించడానికి లేదా ఆన్‌లైన్ తరగతులకు మార్చడానికి డిప్యూటీ కమిషనర్‌లను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
పాఠశాలలు మూసివేసే ఆలోచనలో పంజాబ్ ప్రభుత్వం:
ఇంకా అధికారిక ఉత్తర్వులు జారీ చేయనప్పటికీ, పంజాబ్ ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. AQI స్థాయిలు ప్రమాదకర స్థాయిలో ఉన్నందున విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో..
ఘజియాబాద్, నోయిడా, మీరట్ వంటి నగరాలు, ఢిల్లీ-ఎన్‌సిఆర్ బెల్ట్‌లో భాగమైనవి. ఇక్కడ కూడా ఎయిర్ పోల్యూషన్ ఎక్కువగా ఉండటంతో పాఠశాలలను మూసివేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి