
మంగళవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. భారతదేశం నుండి ఉగ్రవాద ముల్లును తొలగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన అన్నారు. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో రూ.5,536 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత మంగళవారం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. “నేను గత రెండు రోజులుగా గుజరాత్‌లో ఉన్నాను. నిన్న వడోదర, దాహోద్, భుజ్, అహ్మదాబాద్‌లను సందర్శించాను, ఈ ఉదయం గాంధీనగర్‌ను సందర్శించాను. నేను ఎక్కడికి వెళ్ళినా, అది కాషాయ సముద్రంలా, దేశభక్తి అలలా అనిపించింది. కాషాయ సముద్రపు గర్జన, రెపరెపలాడే త్రివర్ణ పతాకం, ప్రతి హృదయంలో మాతృభూమి పట్ల అపారమైన ప్రేమ. ఇది మరపురాని దృశ్యం అని ప్రధాని మోదీ అన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 1947లో కశ్మీర్‌లోకి ప్రవేశించిన ముజాహిదీన్‌లను మనం చంపి ఉంటే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మనకు ఎదురయ్యేది కాదని అన్నారు. “1947లో విభజన జరిగినప్పుడు, ఆ సమయంలోనే లింకు తెంచిఉండాల్సింది. కానీ అలా చేయకపోగా.. దేశాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఆ వెంటనే కశ్మీర్‌లో మొదటి ఉగ్రవాద దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ కశ్మీర్‌లోని ఒక భాగాన్ని ఆక్రమించింది. మనం ఈ ముజాహిదీన్‌లను చంపి ఉంటే, పీఓకేను తిరిగి పొందే వరకు సైన్యం ఆగకూడదని సర్దార్ పటేల్ చెప్పిన మాట విని ఉంటే బాగుండేదని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మాటను అప్పటి ప్రభుత్వం వినకపోవడం వల్ల 75 సంవత్సరాలుగా మనం బాధపడుతన్నాం. భారత సైన్యం ప్రతిసారీ పాకిస్తాన్‌ను ఓడించింది. భారతదేశంపై గెలవలేమని పాకిస్తాన్ అర్థం చేసుకుంది.
పాకిస్తాన్ జెండాలను ఉగ్రవాదుల శవపేటికలపై ఉంచారు, పాక్ సైన్యం వారికి సెల్యూట్ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలు పరోక్ష యుద్ధం కాదని, బాగా ప్రణాళికాబద్ధమైన యుద్ధ వ్యూహమని ఇది రుజువు చేస్తుందని మోదీ ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ.. సింధు జల ఒప్పందంపై తప్పుగా చర్చలు జరిగాయని, కశ్మీర్‌లోని ఆనకట్టల పూడిక తీయడాన్ని కూడా నిషేధించే నిబంధనలు ఉన్నాయని ఆయన అన్నారు. “2014 మే 26న నేను తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఆ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంది. నేడు భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇప్పుడు మనం జపాన్‌ను అధిగమించడం మనందరికీ గర్వకారణం. 250 సంవత్సరాలు మనల్ని పాలించిన యునైటెడ్ కింగ్‌డమ్‌ను కూడా మనం అధిగమించాం అని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి