ఛీ.. మనుషులు ఇలా కూడా ఉంటారా? రెండో పెళ్లి కోసం చిన్నారికి విషం పెట్టిన తల్లి!

తమిళనాడులోని సేలంలో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల లలిత అనే మహిళ, రెండో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో తన 18 నెలల కుమారుడికి విషమిచ్చి హత్య చేసింది. చిన్నారి మృతి అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు దర్యాప్తు చేయగా, రెండో పెళ్లికి అడ్డుగా ఉంటాడనే భయంతో బాలుడిని చంపినట్లు తల్లి అంగీకరించింది.

ఛీ.. మనుషులు ఇలా కూడా ఉంటారా? రెండో పెళ్లి కోసం చిన్నారికి విషం పెట్టిన తల్లి!
Salem Mother

Updated on: Jun 13, 2026 | 6:12 PM

తమిళనాడులోని సేలం జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. రెండో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో తన 18 నెలల కుమారుడికి విషమిచ్చి హత్య చేసిన ఆరోపణలపై 23 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తూరు సమీపంలోని వరగూర్ గ్రామానికి చెందిన లలిత అనే మహిళకు తిరుమలై వాసుదేవన్‌తో వివాహం జరిగింది. అయితే దంపతుల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారు.

వారి పెద్ద కుమారుడు హర్సన్‌రాజ్ తండ్రి వద్ద ఉండగా, 18 నెలల చిన్నారి మాత్రం లలితతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో లలిత మరో వ్యక్తితో సన్నిహిత సంబంధం ఏర్పరుచుకుని అతడిని వివాహం చేసుకోవాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. అయితే తన వద్ద ఉన్న చిన్నారి వివాహానికి అడ్డంకిగా మారుతాడని ఆమె భావించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో బాలుడి ఆహారంలో విషం కలిపి తినిపించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.

విషప్రభావంతో చిన్నారి స్పృహ కోల్పోవడంతో, ఏం ఎరగనట్టు నటిస్తూ లలిత ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లి అనారోగ్య కారణంగా అస్వస్థతకు గురయ్యాడని చెప్పినట్లు సమాచారం. అయితే పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలుడి మరణం అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా లలితను ప్రశ్నించగా, రెండో పెళ్లికి అడ్డుగా ఉంటాడనే భయంతో విషం ఇచ్చినట్లు ఆమె ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా లలితను అరెస్టు చేసిన పోలీసులు, ఆమెపై హత్య కేసు నమోదు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us