RRS Chief Mohan Bhagwat: తెలంగాణ పర్యటనలో భాగంగా.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారని సంఘ్ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు భగవత్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం లింగపూర్‌లో మోహన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సేంద్రీయ సాగు చేస్తున్న రైతులతో ఆర్ఎస్ఎస్ చీఫ్ ముఖాముఖి నిర్వహించనున్నారు. ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పలు విషయాలపై మోహన్ భగవత్ మాట్లాడనున్నారు.
కాగా.. గురువారం హైదరబాద్ హైటెక్స్ సిటీలో జరిగిన కార్యక్రమంలో ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ రచించిన విశ్వభారతం గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ధర్మబద్ధంగా జీవించేది హిందూ సమాజమేనని భగవత్ పేర్కొన్నారు. చివరికి ప్రపంచానికి దారి చూపగలిగినది కూడా భారతదేశమేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.
కాలకూట విషాన్ని కూడా గరళంలో ఉంచుకుని శివుడు ప్రపంచాలను కాపాడాడని, అదేవిధంగా ప్రపంచంలో కలిగే అనేక వికృతులు, విపత్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడగలిగేది భారతదేశమనే విషయాన్ని అన్నీ దేశాలు గుర్తిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.