
ఆసుపత్రులు అంటే ప్రాణాలు కాపాడే చోటు. కానీ భోపాల్‌లోని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆసుపత్రిలో ఒక మహిళా ఉద్యోగికి భయంకరమైన అనుభవం ఎదురైంది. నిత్యం రద్దీగా ఉండే లిఫ్ట్ లోనే ఒక దొంగ ఆమెపై దాడి చేసి మెడలోని గొలుసును లాక్కెళ్ళాడు. ఆదివారం నాడు ఎయిమ్స్ లోని గైనకాలజీ విభాగంలో పనిచేసే వర్ష సోని అనే ఉద్యోగిని తన పని ముగించుకుని బ్లడ్ బ్యాంక్ వెనుక ఉన్న లిఫ్ట్ ఎక్కారు. ఆ సమయంలో ముసుగు ధరించిన ఒక యువకుడు కూడా లిఫ్ట్ లోకి ప్రవేశించాడు. ఆమెను నమ్మించడానికి కంటి విభాగం ఏ అంతస్తులో ఉంది?” అని అడిగాడు. లిఫ్ట్ మూడవ అంతస్తుకు రాగానే ఆ యువకుడు బయటకు వెళ్తున్నట్లు నటించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి వర్షపై పడ్డాడు. ఆమె మెడలోని బంగారు గొలుసు, మంగళసూత్రాన్ని బలంగా లాగాడు. వర్ష గట్టిగా ప్రతిఘటించినా, అతను ఆమెను పక్కకు తోసేసి మంగళసూత్రంతో మెట్ల మార్గంలో పారిపోయాడు. ఈ తోపులాటలో ఆమె ముత్యాల హారం విరిగి కింద పడిపోయింది.
నిత్యం రద్దీగా ఉండే లిఫ్ట్ ప్రాంతంలో కనీసం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం గమనార్హం. ఆదివారం కావడంతో భద్రత సడలించినట్లు తెలుస్తోంది. దీనిని ఆసరాగా చేసుకున్న నిందితుడు ఐపీడీ గేటు ద్వారా సులభంగా తప్పించుకున్నాడు. దాడికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డు అయ్యింది. అయితే నిందితుడు ముసుగు ధరించడం వల్ల అతన్ని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. బాధితురాలు వర్ష సోని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాగ్షెవానియా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇంతవరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి వంటి సురక్షిత ప్రాంతాల్లోనే ఇలాంటి ఘటనలు జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ తరహా ఘటనలు భోపాల్‌లో గత ఏడాది కాలంలో నాలుగు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం కొత్త క్రిమినల్ ఫ్రేమ్‌వర్క్‌లో జరిగిన మార్పులని నిపుణులు భావిస్తున్నారు. గతంలో దోపిడీ కిందకు వచ్చే ఇటువంటి నేరాలకు 10 నుండి 14 ఏళ్ల శిక్ష ఉండేది. ప్రస్తుతం వీటిని స్నాచింగ్ కిందకు మార్చడంతో గరిష్ట శిక్ష కేవలం 3 ఏళ్లకు పరిమితమైంది. కొత్త నిబంధనల ప్రకారం అరెస్టు తప్పనిసరి కాదు, నోటీసులతోనే నిందితులు బయటపడే అవకాశం ఉంది. భోపాల్ పోలీసు రికార్డుల ప్రకారం.. 2024లో కేవలం 39 స్నాచింగ్ కేసులు నమోదు కాగా 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 165కు చేరింది.
AIIMS Bhopal.
They snatched the chain from a female doctor. These days, such looting is being seen from Delhi to Bhopal, inside homes and hospitals alike. pic.twitter.com/d3kGWxX1wY
— viral politics (@viral__politics) January 27, 2026