
ఏలూరు: తెలుగు రాష్ట్రాలను పులులు వణికిస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో సంచరించిన మగ పులి పోలవరం అభయారణ్యం ప్రాంతం నుంచి తెలంగాణకు వెళ్లి తిరిగి ఏపీలోకి ప్రవేశించింది. ప్రస్తుతం తన ప్రయాణం పోలవరం అభయారణ్యం వైపుసాగుతుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజులపాటు దాని కదలికలను గుర్తించి ఆ తరువాత ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ఏలూరు జిల్లా ఫారెస్ట్ అధికారులు ఉపసంహరించుకుంటారు. మరోవైపు ఒరిస్సాలోని సిమిలిపాల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో అరుదైన బ్లాక్ టైగర్ ట్రాప్ కెమారాలకు చిక్కింది. సాల్, టేకు, వెదురు చెట్లు ఎక్కువగా వుండే ఈ అటవీ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. బ్లాక్ టైగర్స్ ఎక్కువగా ఈ అటవీ ప్రాంతంలోని కనిపిస్తుంటాయి. పులుల శరీరంలో మెలనిజం అధికం కారణంగా పులులు నల్లని చారలతో ఉంటాయి. సిమిలిపాల్ నేషనల్ పార్క్‌లో అటవీ సిబ్బంది, నిపుణులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు తాజాగా బ్లాక్ టైగర్ కనిపించటం పర్యావరణ సమతుల్యతకు దోహద పడుతుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
ఇక సిమిలిపాల్‌లో పులుల సంఖ్య పెరగటానికి అక్కడ సాల్ చెట్లు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఈ చెట్లు ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌తో పాటు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని చోట్ల పెరుగుతున్నాయి. ఇవి ఎండా, వానలను తట్టుకోవటంతో పాటు చాలాకాలం జీవిస్తాయి. సాల్ చెట్లతో ఉన్న అడవులు పులుల నివాసానికి అనుకూలంగా ఉంటాయి. అందుకే సిమిలిపాల్‌లో పులుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుంది. 1975 – 76 ప్రాంతంలో అటవీ అధికారులు , విదేశీ పర్యాటకులు తొలిసారిగా నల్ల పులులను చూసారు. ఇవి ప్రత్యేకంగా ఈ ప్రాంతంలోనే జీవిస్తున్నాయి. ఇవి అరుదైన జాతిగా గుర్తించబడటంతో సిమిలిపాల్‌లో వీటిని పరిరక్షిస్తున్నారు.
1994లో జీవవైవిధ్య పరిరక్షణకు సంబంధించి యునెస్కో బాయిస్పియర్ రిజర్వ్ ప్రాంతంగా సిమిలిపాల్ గుర్తింపు పొందింది. ఇక్కడ పులులు మాత్రమే కాకుండా చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, జింకలతో పాటు పలు అరుదైన పక్షిజాతులకు ఈ సిమిలిపాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నిలయంగా ఉంది. తాజాగా ఈ నెల జనవరి 20న హరివిజయ్ సింగ్ బహియా తన కెమెరాలో బ్లాక్ టైగర్‌ను తన కెమెరాలో బంధించారు. అంతకు ముందు నాగపూర్‌కు చెందిన ప్రసేన్ జిత్ యాదవ్ తీసిన నల్ల పులి ఫోటోలు నేషనల్ జియోగ్రాఫిక్ 2025 అక్టోబర్ ఎడిషన్ కవర్ ఫోటోగా వచ్చాయి.
మరోవైపు ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు భారత రాష్ట్రపతి ముర్ము ఒడిస్సాలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె సిమిలిపాల్‌లో నేషనల్ పార్క్‌ను సందర్శిస్తారు. ఈ సందర్బంగా మూడు రోజుల పాటు పర్యాటకులను పార్క్ సందర్శనకు అనుమతించరు.