ఏనుగు కూడా ఓటు వేయడానికి వచ్చిందా? ఝార్‌గ్రామ్‌ పోలింగ్ కేంద్రం వద్ద గజరాజు సందడి!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ వేళ ఒక అరుదైన, ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఝార్‌గ్రామ్ జిల్లాలోని జితుషోల్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద గురువారం ఉదయం ఓటింగ్ ప్రారంభానికి సిద్ధమవుతుండగా, అకస్మాత్తుగా ఒక ఏనుగు ప్రత్యక్షం కావడంతో ఓటర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ఏనుగు కూడా ఓటు వేయడానికి వచ్చిందా? ఝార్‌గ్రామ్‌ పోలింగ్ కేంద్రం వద్ద గజరాజు సందడి!
Elephant Into Polling Both

Updated on: Apr 23, 2026 | 1:53 PM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ వేళ ఒక అరుదైన, ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఝార్‌గ్రామ్ జిల్లాలోని జితుషోల్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద గురువారం (ఏప్రిల్ 23) ఉదయం ఓటింగ్ ప్రారంభానికి సిద్ధమవుతుండగా, అకస్మాత్తుగా ఒక ఏనుగు ప్రత్యక్షం కావడంతో ఓటర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ఓటింగ్ ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు, పోలింగ్ కేంద్రం వెలుపల ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో స్థానికంగా ‘రామ్‌లాల్’ అని పిలవబడే ఒక ఏనుగు అడవి నుంచి నేరుగా పాఠశాల ఆవరణలోకి వచ్చింది. ఏనుగును చూడగానే ఓటర్లు పరుగులు తీయడంతో అక్కడ స్వల్ప గందరగోళం నెలకొంది. అయితే, రామ్‌లాల్ ఎవరికీ ఎటువంటి హాని చేయలేదు. అది అక్కడే నిలిపి ఉంచిన ఒక సరుకు రవాణా వాహనాన్ని పరిశీలించి, కాసేపటి తర్వాత నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే లోధాశూలి రేంజ్ అటవీ శాఖ అధికారులు ఐరావత్ వాహనంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. 15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం రామ్‌లాల్‌ను సురక్షితంగా జనావాసాలకు దూరంగా అడవిలోకి పంపించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం ఓటింగ్ సజావుగా కొనసాగింది. ఏనుగుల సంచారాన్ని పర్యవేక్షించడానికి ‘హులా పార్టీ’ సభ్యులతో కూడిన క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంచారు.

ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 152 నియోజకవర్గాలకు మొదటి దశలో పోలింగ్ జరుగుతోంది. ఇందులో ఝార్‌గ్రామ్ జిల్లాలోని నాలుగు స్థానాలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల కోసం ముందెన్నడూ లేని విధంగా 2,407 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. కాగా, మిగిలిన 142 నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

ఓటర్ల లైన్‌లోకి వచ్చిన ఏనుగు వీడియో ఇక్కడ చూడండి:

మరోవైపు, వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో అటవీ శాఖ తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తొలి దశ పోలింగ్ విజయవంతంగా కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us